జ‌న‌సేనానికి ప్ర‌శ్నించే స‌మ‌యం వ‌చ్చిందా? ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్‌కే కేటాయించ‌బోతున్నాడా? రాజ‌కీయాల్లో హీట్ పుట్టించేందుకు ప‌వ‌న్ రెడీ అయిన‌ట్టే తెలుస్తోంది. మ‌రోసారి ఆవేశ ప‌రిస్థితుల్లో ఉన్న ప‌వ‌న్ రాజ‌కీయాల్లో దుమ్మురేపేందుకు సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకునే పవన్ కళ్యాణ్ కేవలం 24 గంటల వ్యవధిలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు నిర్ణయం తీసేసుకున్నారు.. తాను అన్ ప్రిడిక్టబుల్ అని మరోసారి నిరూపించుకున్నారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సమయాన్ని పూర్తిగా లేదా ఎక్కువగా రాజకీయాలకు కేటాయించనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు. ఇప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీ ఇక నుంచి క్రియాశీలకంగా మారేందుకు రెడీ అవుతోంది. పార్టీ ప్రస్థానం పేరుతో తిరుపతిలో జనసేన మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. 

ఇంత‌కీ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న హ‌డావిడి దేనికోసం అనేదానిపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు కాస్త వేడిగానే వున్నాయి. విభ‌జ‌న జ‌రిగి రెండేళ్లు గ‌డిచిపోయినా ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ప్ర‌భుత్వం నాన్చుడు ధోర‌ణితో ఉండ‌టంతో ప‌వ‌న్ విసుగు చెందాడ‌ని అంటున్నారు. ఇక‌ టీడీపీ స‌ర్కార్ కూడా కేంద్రంతో దోస్తీ చేస్తూనే కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌హాలోనే ప్ర‌త్యేక హోదాపై పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదాపై త‌న‌దైన శైలిలో పోరాటానికి దిగే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు హీరోల అభిమానుల మ‌ధ్య ఏర్ప‌డుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై కూడా ప‌వ‌న్ ఘాటుగా స్పందించే అవ‌కాశాలు ఉన్నాయి. 

టార్గెట్ 2017తునిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ ఘ‌ట‌న‌.. విశాఖ‌ను అల్ల‌క‌ల్లోలం చేసిన హుదూద్ తుఫాన్.. ఏపీ రాజ‌ధాని భూముల అన్యాక్రాంతం.. ముద్ర‌గ‌డ కాపు ఉద్య‌మాలు.. టాపిక్ ఏదైనా రాజ‌కీయ‌నేత‌లంతా హ‌ల్‌చ‌ల్ చేసినా.. ప‌వ‌న్ మాత్రం అస్స‌లు స్పందించ‌నేలేదు. ప‌వ‌న్ త‌న‌కి తానుగా కొన్ని ప‌రిమితుల్ని నిర్ధేశించుకుని త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం కేవ‌లం సినిమాల‌పైనే అత‌డి దృష్టి. అయితే పార్టీని ముందుకు న‌డిపించేదెప్పుడు? జ‌న‌సేన బండిని పూర్తి స్థాయిలో ప‌ట్టాలెక్కించేదెప్పుడు? రాజ‌కీయాల్లో మార్పు తెచ్చేదెప్పుడు? ఈ సందేహాలు అభిమానుల్లో మెదులుతూనే ఉన్నాయి. అందుకే ప‌వ‌న్ త‌న భ‌విష్య‌త్ ప్లాన్ రెడీ చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. 2017 డిసెంబ‌ర్ డెడ్‌లైన్‌. అప్ప‌టివ‌ర‌కూ సినిమాల‌న్నీ పూర్తి చేసుకుని ఇక రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలోకి పూర్తి స్థాయిలో దిగిపోయేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్టే క‌నిపిస్తోంది.

2019 ఎన్నిక‌ల బ‌రిలోకి వ‌చ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ప‌వ‌న్ ఇక పార్టీని బ‌లోపేతం చేసేందుకు అన్ని ప్లాన్స్‌ని రెడీ చేశారు. జిల్లా పార్టీ అధ్య‌క్షులు, రాష్ట్రాల అధ్య‌క్షుల్ని ఎంపిక చేసేందుకు ముహూర్తం డిసెంబ‌ర్ అని పార్టీలో చెప్పుకుంటున్నారు. విజ‌య‌వాడ‌, విశాఖ లేదా రాజ‌మండ్రిలో ఓ భారీ స‌భ నిర్వ‌హించి జ‌న‌సేన స్పీడ్ ఏంటో చూపించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారుట‌. భారీ జ‌న‌సందోహం మ‌ధ్య భారీ స‌భ‌ను ఏర్పాటు చేసి త‌న బ‌లం ఏంటో చూపించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారుట‌.

ప్ర‌శ్నించేందుకే...2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టీడీపీ—బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ప్రభుత్వం తప్పు చేస్తే తాను కచ్చితంగా ప్రశ్నిస్తానని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వాలని ప్రశ్నించిన సందర్భాలున్నాయి. పవన్ ప్రశ్నాస్త్రాల పైన అధికార టీడీపీ, బీజేపీ, ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్ పార్టీలు ఆయా రీతుల్లో స్పందించారు. 

ప‌వ‌న్‌కు క్లారిటీ లేదా? నిజానికి `స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌` రిలీజ్ త‌ర్వాత ప‌వ‌న్ పూర్తిగా రాజ‌కీయాల‌కే స‌మ‌యం వెచ్చిస్తార‌ని ప్ర‌చారం సాగింది. అయితే అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌దొక్క‌టి. ఆ మూవీ వెంట‌నే మ‌రో కొత్త సినిమా ప్రారంభించి బిజీ అయిపోయారు. ఎస్‌జె సూర్య ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. జ‌న‌సేన పార్టీ ప్రారంభించి చాలా కాల‌మే అయినా ఇప్ప‌టికీ యాక్టివ్‌గా ప‌వ‌న్ తెర‌పైకి రాక‌పోవ‌డంపై కొన్ని విమ‌ర్శ‌లొచ్చాయి. ప్ర‌త్య‌ర్థులు ప‌వ‌న్‌ని రింగులోకి లాగేందుకు శ‌త‌ధా ప్ర‌య‌త్నిస్తున్నారు. `ప్ర‌శ్నించేందుకు జ‌న‌సేన అంటూ బీరాలు ప‌లికారు. ఇంకా రారేం? అంటూ ప్ర‌శ్నించేవారున్నారు. అలాగే చంద్ర‌బాబు, మోడీ విష‌యంలోనూ ప‌వ‌న్ త‌న వైఖ‌రిని స్ప‌ష్టంగా చెప్ప‌లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. 2019లో పోటీ చేస్తానో లేదో? డ‌బ్బుల్లేవ్‌! అంటూ ప‌వ‌న్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ప్ర‌త్య‌ర్థులు కామెంట్లు రువ్వారు.

ఇలాంటి టైమ్‌లో ప‌వ‌న్ ఇంకా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డం ఏంటో అర్థం కాని వ్య‌వ‌హారం అంటూ అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో, ఇటు ప‌రిశ్ర‌మ‌లో ముచ్చ‌ట్లు సాగాయి. అయితే ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయ శూన్య‌త రాజ్య‌మేలుతోంది. ఏ పార్టీని ప్ర‌జ‌లు విశ్వ‌సించే ప‌రిస్థితి లేదు. ఇలాంట‌ప్పుడు .. ప‌వ‌న్ కాస్తంత చొర‌వ తీసుకుంటే 2019లో జ‌న‌సేన హ‌వా చూపించే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు. అందుక‌నే కావ‌చ్చు జ‌న‌సేనాని దూకుడు పెంచే టైమ్ వ‌చ్చింది. మ‌రి ప‌వ‌న్ త‌న క్రియ‌శీల‌క రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎంత బాగుంటుందో ఆయ‌న ఆవేశంతో కాకుండా ఆలోచ‌న‌ల‌తో తీసుకునే నిర్ణ‌యాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: