ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టి ప్ర‌జ‌ల దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి రాజ‌కీయ ముఖ‌చిత్రంలో కీల‌కంగా మారాడు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో విరుచుక‌ప‌డ్డాడు. ఎంపీల‌ను, కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ ప్ర‌భుత్వాల‌పై నాయ‌కుల‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ, ప్ర‌త్యేక హోదా కోసం రంగంలోకి దిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. త‌న పోరాటం ఎంత‌వ‌ర‌కు సాగిస్తాడో ఏ త‌ర‌హాలో సాగిస్తాడో అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్.


జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి త‌న ఆవేశం చూపించాడు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ త‌న‌దైన శైలిలో గ‌ర్జించాడు.  తన ప్రసంగంలో మూడు భాషల్లో రెచ్చిపోయాడు. ‘ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ కావాలంటూ మన ఎంపీలు ఢిల్లీలో తెలుగులో అడుగుతుంటే హిందీ మాత్రమే తెలిసిన కేంద్రానికి అర్థం కావడం లేదనీ, మన ఆవేదన వారికి సరిగా చేరడం లేదంటూ’ తెలుగు, హిందీ, ఇంగ్లీషులో తెలుగువారి ఆవేదనను కేంద్రానికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. మొదట తెలుగులో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ చెప్పి.. ఆ తర్వాత హిందీలో లడేంగే లడేంగే.. జీతేతక్ లడేంగే.. (పోరాడదాం.. పోరాడదాం.. సాధించే వరకూ పోరాడదాం..) అంటూ గొంతెత్తాడు. త‌ర్వాత ఇంగ్లీషులోనూ మాట్లాడుతూ.. ‘మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు కాబట్టి మా బాధ అర్థం కావడంలేదేమో’ అంటూ ఆవేశంగా ప్రసంగించాడు. 


పోరాటంపై స్ప‌ష్ట‌త‌ఏపీకి ప్రత్యేక హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేస్తానని పవన్‌ స్పష్టం చేశాడు. మొదటి దశలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో సభలు పెడతానన్నారు. కాకినాడలోనే తొలి మీటింగ్‌ పెడతానని తెలిపారు. రెండో దశలో అన్ని పార్టీల ఎంపీలపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ రూపొందిస్తామన్నారు. ఎంపీలు గట్టిగా పోరాడకపోతే.. రోడ్డుమీదకు వస్తామని హెచ్చరించారు. రాయితీలు ఇవ్వకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని, యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని కేంద్రాన్ని పవన్‌ ప్రశ్నించారు. ఏపీకి ఆర్థికలోటు ఉందని.. భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చిచెప్పారు. వ్యక్తిగత సంబంధాలతో ప్రయోజనం ఉండదని, ప్రజా సమస్యలపై పోరాడక తప్పదన్నారు.


ఆవేశం వచ్చిన‌ప్పుడే..?ప‌వ‌న్ ఆవేశం చూస్తుంటే ఇక‌పై రాజ‌కీయాల్లో క్రియ‌శీల‌కంగా మారుతాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. అయితే ఇక్క‌డో స‌మ‌స్య ప‌వ‌న్ ఆవేశం వ‌చ్చిన‌ప్పుడే మీడియా ముందుగానీ, స‌భ‌ల్లో గానీ మాట్లాడుతాడ‌ని మిగ‌తా స‌మయాల్లో సినిమాల‌తోనే బీజీ అవుతార‌నే వాద‌న‌ కూడా ఉంది. ఎందుకంటే ప్ర‌శ్నించే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు జ‌న‌సేన ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తుంద‌ని చెబుతూ వస్తున్న ప‌వ‌న్.. స‌మ‌స్య‌లు ఉన్నా లేక‌పోయినా, త‌న‌కు ఆవేశం వ‌చ్చినప్పుడే ఇలాంటి స్పీచ్‌లు ఇవ్వ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అనే వాద‌న‌లూ ఉన్నాయి. 


ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయం అంటూ తాజాగా ప్ర‌క‌టించిన‌ ప‌వ‌న్.. త‌న రాజ‌కీయ‌ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అనే క్లారిటీ ఎవ‌రికీ ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే రెండు గుర్రాల‌పై స్వారీ చేసే ప‌వ‌న్ ఒంట‌రిగా త‌న పార్టీని ఎలా బ‌లోపేతం చేస్తాడ‌నేదే ఇప్పుడు ఎదుర‌వుతున్న అస‌లు విష‌యం. గ్రామీణ స్థాయి నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను తయారు చేయ‌డం, పార్టీ సిద్ధాంతాల‌ను తయారు చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం అంతా ఆషామాషి వ్య‌వ‌హారం కాదు. ఇత‌ర పార్టీల్లోంచి వ‌చ్చే సీనియ‌ర్ నేత‌లంటే ప‌వ‌న్ కు న‌చ్చ‌దు. జ‌న‌సేన‌లోకి వ‌స్తాన‌నే అలాంటి సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌వ‌న్ రిజ‌క్ట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ బ‌రువు బాధ్య‌త‌ల‌ను చూసుకునే రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌వారెవ‌రు అనే విష‌యం ఇప్పుడు ప్ర‌ధానంగా మారింది.


2019 ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోతుంద‌న్న‌ది స్ప‌ష్టం. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌కంగా మారుతాడ‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే ఈ ప‌రిస్థితుల్లో జ‌న‌సేన పార్టీని ఎంత‌వ‌ర‌కు బ‌లోపేతం చేస్తాడ‌నేది ఇప్పుడు అస‌లు విష‌యం.  


మరింత సమాచారం తెలుసుకోండి: