తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి క‌ల్లోలం రేగింది. ఒక‌రు ఎడ్డేం అంటే మ‌రొక‌రు తెడ్డేం అంటున్నారు, పాల‌క ప‌క్షాన్ని ఇరుకున పెట్టాల్సింది పోయి ప్ర‌తిప‌క్షమే ఇబ్బందులు ప‌డుతోంది. గోదావ‌రి న‌దిపై ఆన‌క‌ట్ట విష‌యంలో మ‌హారాష్ట్ర స‌ర్కార్‌తో చేసుకున్న ఒప్పందాలతో తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టార‌ని కాంగ్రెస్ నేత‌లు కేసీఈఆర్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. మ‌హారాష్ట్ర స‌ర్కార్‌తో జ‌రిగిన జ‌ల ఒప్పందాల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్‌, మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్‌ల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాల‌ను బ‌య‌టపెట్టాల‌ని సూచించారు. గ‌తంలో కాంగ్రెస్ హాయంలోనూ ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఒప్పందాలు జ‌రిగాయ‌ని, వాటినే నేడు కేసీఆర్ త‌న ఘ‌న‌కార్యంగా చెప్పుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. కావాలంటే గ‌త ఒప్పందాల‌ను, కేసీఆర్ చేసుకున్న ఒప్పందాల‌ను బ‌య‌ట‌పెడుతామంటూ కాంగ్రెస్ నేత‌లు గ‌ట్టిగానే చెప్పారు.

 Image result for kcr meeting

కాంగ్రెస్ నేత‌ల స‌వాల్‌కు సీఎం కేసీఆర్ సైతం ఘాటుగానే స్పందించారు. త‌మ ఒప్పందాల‌ను, గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు మ‌హారాష్ట్ర‌తో చేసుకున్న జ‌ల ఒప్పందాల‌పై చ‌ర్చ‌కు తాము సిద్ధ‌మేన‌ని, తాను ఈ సాయంత్రం వ‌ర‌కు ఇక్క‌డే ఉంటా..! మీ ద‌గ్గ‌ర ఉన్న ఒప్పంద ప‌త్రాల‌తో రండి తేల్చుకుందాం అన్నారు. అంత‌టితో ఆగ‌ని కేసీఆర్‌, అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకునేది లేద‌ని, కేసులు పెడుతామ‌ని హెచ్చ‌రించారు. అయినా కేసుల‌కు బ‌య‌ప‌డేది లేద‌ని కాంగ్రెస్ నేత‌లు త‌మ వాగ్భాణాల‌ను వ‌దులుతూనే ఉన్నారు.

 Image result for kcr maharashtra cm

ఈ వేడి చ‌ల్లార‌క ముందే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, పెద్ద‌లు జానారెడ్డి సార్ సీన్‌లోకి ఎంట‌ర‌య్యారు. గోదావ‌రి జ‌లాల విష‌యంలో జ‌రిగిన ఒప్పందాల్లో కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగింది ఏమీ లేద‌ని, కేసీఆర్ కృషివ‌ల్లే తెలంగాణ‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని తేల్చి చెప్పారు. దీంతో కేసీఆర్‌తో సై అంటే సై అన్న పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ త‌దిత‌ర కాంగ్రెస్ నేత‌లు వెనుక‌డుగు వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇదే అదునుగా భావించ‌న టీఆర్ఎస్ నేత‌లు ఎదురుదాడి ప్రారంభించారు. పెద్ద‌లు జానారెడ్డి వాస్త‌వాలు చెప్పార‌ని అనవ‌స‌ర వివాదాలు సృష్టించ‌డం మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు.

 Image result for kcr maharashtra cm

పాల‌క ప‌క్షాన్ని ఇరుకున పెడుతామ‌ని భావించిన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌కు.. త‌మ పార్టీ సీనియ‌ర్ నేత వ‌ల్లే తాము ఇరుకున ప‌డ‌డాన్ని త‌ట్టుకోలేక పోతున్నారు. పార్టీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ని గ‌తంలో రాష్ట్ర నేత‌లు ధిల్లీ అధిష్టాన పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్లి పంచాయితీ పెట్టుకున్నారు. అయినా తీరు మార‌ని పెద్ద‌లు జానారెడ్డి అధికార పార్టీకి వంతుపాడుతున్నార‌ని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటే.. జానారెడ్డి చ‌ర్య‌ల‌తో పార్టీ శ్రేణుల్లో ఆత్మ‌స్తైర్యం దెబ్బ‌తింటుంద‌ని ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు వాపోతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం  తెలంగాణ‌లో ఇబ్బందులు ప‌డుతున్న కాంగ్రెస్ తిరిగి త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుంటుందా.. నేత‌ల మ‌ధ్య ఉన్న త‌గాదాలు తీర్చేందుకు అధిష్టానం ఏం చేయ‌బోతోంది. అన్న‌ది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: