బైక్ లేదా కారు.. వాహనమేదైనా.. ఇంధన ఆదా కోసం మనం వెళ్లే రూటులో షార్ట్ కట్స్ వెతుక్కోవడం సర్వసాధారణం. దూరం తగ్గితే సమయం, ఇంధనం కూడా ఆదా అవుతుంది. కాబట్టి మనం వెళ్లే రూటుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఉంటాం.  షార్ట్ కట్స్ రోడ్డు రవాణా వ్యవస్థకే కాదు.. తమకు ముఖ్యమేనంటున్నాయి విమానయాన సంస్థలు. వేల కిలోమీటర్ల దూరంలోని విదేశాలకు వెళ్లేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. భారీ స్థాయిలో ఇంధనం వినియోగమవుతోంది. ఇందుకయ్యే ఖర్చులను విమానసంస్థలు ప్రయాణికులపై రుద్దుతుండటంతో.. వారికి భారంగా మారుతుంది. మొత్తంగా దాని ప్రభావం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 


ఖర్చులను తగ్గించుకుని.. ప్రయాణికులను వీలైనంత త్వరగా గమ్యం చేర్చడంపై భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దృష్టిపెట్టింది. ఇండియా నుంచి అమెరికాకు విమానయానంలో భారీ మార్పులు చేయబోతుంది. ప్రస్తుతం ఢిల్లీ నుండి అమెరికా వెళ్తున్న రూటుకు ప్రత్యామ్నాయంగా మరో షార్ట్ కట్ రూటును ఎంచుకుంది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్లే ఎయిర్‌ఇండియా విమానాలు ఈ ఏడాది నవంబర్ నుండి ఈ కొత్తదారిలో ప్రయాణించనున్నాయి.  ఈ రూటులో వెళ్లడం ద్వారా ప్రస్తుత ప్రయాణ సమయం కంటే మూడు గంటలు ముందుగానే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
ఇంధన ఖర్చు, అదనపు గంటల ప్రయాణంపై దృష్టి సారించిన ఎయిర్ ఇండియా.. డీజీసీఏకు పలు సూచనలు, ప్రతిపాదనలు చేసింది. వాటిని పరిశీలించిన  డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. అంగీకారం తెలుపుతూ ఆమోద ముద్ర వేసింది.
Image result for airplane
ప్రస్తుతం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే అన్ని ఎయిర్ ఇండియా విమానాలు టేకాఫ్ అయిన తర్వాత పశ్చిమ దిశగా అట్లాంటిక్ మహాసముద్రం మీదనుంచి వెళుతున్నాయి. అలా ప్రయాణించినప్పుడు.. ఎదురుగాలి బలంగా వీస్తుందని, కొన్నిసార్లు గంటకు 24 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని డీజీసీఏకు తెలిపింది. అంటే విమానవేగం గంటకు సుమారు 800 కిలోమీటర్లు అనుకుంటే వాస్తవేగం మాత్రం 776 కిలోమీటర్లే ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా ఇంధన వినియోగం అధికంగా ఉంటుందని.. మొత్తంగా ఎక్కువ ఖర్చవుతుందని డీజీసీఏకు తెలిపింది.

Image result for airplane

అంట్లాంటిక్ మీదుగా కాకుండా.. ఢిల్లీ నుంచి తూర్పుదిశగా అమెరికాకు వెళ్లడం వల్ల.. పసిఫిక్ ప్రాంతంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంధనం, ప్రయాణ సమయం కలిసివస్తాయని ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. విమానాలు తూర్పుదిశగా, పసిఫిక్ మీదుగా వెళ్లేటప్పుడు..  గాలులు విమానం ప్రయాణించే దిశలోనే గంటకు 138కి.మీ వేగంతో వీస్తాయని, విమానం గంటకు 800 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందనుకుంటే వాస్తవవేగం గంటకు 938 కి.మీ ఉంటుంది’  అంచనా వేశారు. పాత మార్గంతో పోలిస్తే కొత్త దారిలో గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చన్నారు. శీతాకాలంలో అయితే మూడు గంటలు,  వేసవిలో అయితే ఒక గంట ముందుగానే శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకోవచ్చని డీజీసీఏకు తెలిపారు. 


ప్రస్తుతం ఢిల్లీ-శాన్‌ ఫ్రాన్సిస్కో మధ్య బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానాలను ఎయిర్ ఇండియా నడుపుతోంది. ప్రస్తుతం 3విమానాలను ఈ రూటులో నడుపుతుండగా.. నవంబర్ నుండి ఈ సంఖ్యను ఆరుకు పెంచనుంది. ఎయిర్ ఇండియా ప్రతిపాదనలపై విమాన ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల వ్యయ, ప్రయాసల గురించి ఆలోచిస్తున్న ఎయిర్ ఇండియాను అభినందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: