మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సొంత గూటికి చేరబోతున్నారు. కొద్ది నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ ఉదయం  ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలసి దేవినేని నెహ్రూ, అవినాష్ లు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. సెప్టెంబర్ 12వ తేదీన అధికారికంగా టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆ రోజున చంద్రబాబు దేవినేని నెహ్రూ, అవినాష్ లతో పాటు.. వారి అనుచర గణాన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు.


రాష్ట్రాభివృద్ధి కోసమే పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్టు దేవినేని నెహ్రూ చెప్పారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానన్నారు. తన అనుయాయులు, కార్యకర్తలతో చర్చించిన తరువాతే కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి కూడా తెలిపానన్నారు. దేవినేనిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర  టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు.


కృష్ణా పుష్కరాలకు ముందే నెహ్రూ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆయన చేరిక వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల దేవినేని నెహ్రూ తమ్ముడు ఖాజీ ప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ తరపున నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని నానీలు వెళ్లారు. కుటుంబ సభ్యుల ఓదార్పు తరువాత అందరూ కలిసి లంచ్ చేశారు. అక్కడే దేవినేని నెహ్రూ అండ్ కో టీడీపీలో చేరేందుకు డీల్ ఓకే అయినట్లు ప్రచారం జరిగింది. తరువాత నెహ్రూ పార్టీలో చేరబోతున్నట్టు కృష్ణాజిల్లా టీడీపీ నేతలకు పార్టీ అధినాయకత్వం నుండి సంకేతాలు అందాయి. తెలుగుదేశం పార్టీలోకి దేవినేని వచ్చేందుకు రెండు రోజుల క్రితం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆపై తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన నెహ్రూ కాంగ్రెస్ ను వీడేందుకే నిర్ణయించుకున్నారు. 


రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతినడంతో.. పార్టీ మారే అంశంపై  రెండేళ్లుగా దేవినేని నెహ్రూ కసరత్తు చేశారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవ‌డానికి నెహ్రూ చాలాసార్లు ట్రై చేసినప్పటికీ.. కాలం క‌లిసిరాక అందులోనే కంటిన్యూ అవుతూ వచ్చారు. తొలుత నెహ్రూ వైఎస్ఆర్సీపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. జ‌గ‌న్ ఓకే అన్నా.. వైసీపీలోనే ఉన్న నెహ్రూ చిరకాల ప్రత్యర్ధి వంగ‌వీటి రాధా ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారనే వార్తలొచ్చాయి. దీంతో నెహ్రూ టీడీపీ పైనే ఆశలు పెట్టుకున్నారు. 

Image result for devineni nehru

టీడీపీలో చేరితేనే తన కుమారుడు అవినాష్ రాజకీయ భవితవ్యాన్ని గాడిలో పెట్టగలనని భావించిన తరువాతే.. సైకిల్ పార్టీ నేతలతో నెహ్రూ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే తొలుత టీడీపీలో చేరేందుకు నెహ్రూకు కొన్ని అవాంతరాలు ఎదురైనట్లు వార్తలొచ్చాయి. గ‌తంలో బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ‌ల‌ను నెహ్రూ తీవ్రమైన పరుష పదజాలంతో పలుమార్లు విమర్శించారు. అందుకే ఆయ‌నకు టీడీపీ నో ఎంట్రీ బోర్డు పెట్టిందని అందరూ అనుకున్నారు. అయితే సోద‌రుడు, టీడీపీ మంత్రి దేవినేని ఉమ మధ్యవర్తిత్వంతో.. నెహ్రూ, అవినాష్ లకు సైకిల్ సైన్యంలో చేరేందుకు మార్గం సుగమమైంది. 


తెలుగుదేశం ఆవిర్భావ సమయంలోనే దేవినేని నెహ్రూ పార్టీలో చేరారు. కంకిపాడు నుండి పార్టీ తరపున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన నెహ్రూ ఆయన మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత 1995లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ప‌నిచేశారు… ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: