మోడలింగ్ రంగంలో ఓ ఎనబైయేళ్ల కుర్రాడు అదరగొడుతున్నాడు. ఎనబైయేళ్ల వ్యక్తిని తాతయ్య అనకుండా కుర్రాడు అంటున్నారనే కదా మీ అనుమానం. చైనాకు చెందిన దేషాన్ వాంగ్ ను చూస్తే ఎవరైనా అతడ్ని కుర్రాడని ఒప్పుకుని తీరాల్సిందే. ఎనిమిది పదుల వయసాచ్చినా.. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోడు. యూత్ కు ధీటుగా గేమ్స్ ఆడతాడు, జిమ్‌లో ఫిట్ నెస్ వర్కవుట్‌ చేస్తాడు. మోడలింగ్ రంగానికి యూత్ ఐకాన్ గా నిలుస్తున్నాడు. 
 
దేషాన్ వాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. 80లో దృఢమైన దేహదారుఢ్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అందుకు అతను అనుసరిస్తున్న జీవనశైలే కారణం. మోడలింగ్‌లో ర్యాంప్‌ వాక్‌లు చెయ్యాలంటే శరీరం ఆకర్షణీయంగా ఉండాలి. యంగ్ ఏజ్ లో మాత్రమే అది సాధ్యమవుతుంది. వాంగ్‌ కు మొదట్నుంచీ మోడలింగ్ అంటే అమితాసక్తి. అయితే అనుకోని పరిస్థితుల్లో థియేటర్‌ ఆర్ట్స్‌ వైపు అడుగులు వేశాడు. తర్వాత సినిమాల్లోనూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఫర్‌బిడెన్‌ కింగ్‌డమ్‌’లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులమెప్పు పొందాడు. అయితే జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది మాత్రం మోడల్ గా మారిన తరువాతే. 

మోడలింగ్ పై తనకున్న ఆసక్తిని చంపుకోలేక దేషాన్.. తనను తాను మార్చుకోవాలను కున్నాడు. తన 49 ఏట నుంచి జిమ్‌.. 50లో స్విమ్మింగ్‌ చేయడం ప్రారంభించాడు. తనకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఎప్పుడైతే కుర్రాళ్లకి దీటుగా క్రీడలు, జిమ్‌, వర్కవుట్‌లు వంటివి చేయడం మొదలు పెట్టాడో అప్పటినుంచే వాంగ్‌కి మోడలింగ్‌లో అవకాశాలు పెరిగాయి. జనాల్లో గుర్తింపు సైతం బాగానే వచ్చింది. ప్రస్తుతం ఫ్యాషన్‌ షోల్లో వాంగ్‌ క్యాట్‌ వ్యాక్‌ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
వాంగ్ ను చూసి యావత్ చైనా గర్వపడుతోంది.

ఆరాటం, తపన, సాధించాలనే కోరిక ఉంటే వయోభారం సమస్య కాదనడానికి వాంగ్ ని ఓ ఉదాహరణగా చెబుతోంది. ఇక వాంగ్ కుటుంబ సభ్యులైతే పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఓ మోడల్‌గా వాంగ్‌ని చూసి తాను గర్వపడుతున్నట్లు ఆయన మనవరాలు తెలిపింది. చైనా యువతకు తన తాత ఆదర్శంగా నిలిచాడని ప్రశంసల వర్షం కురిపించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: