హైదరాబాద్ లో మామూలుగానే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. మెట్రో పనులతో సగం కుంచించుకు పోయిన రోడ్లపై వెళ్తునప్పుడు.. వర్షం పడితే.. ఎలా ఉంటుందో..ఇక  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కష్టాలు ఎలా ఉంటాయో.. భాగ్యనగర రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకే అనుభవం. సాధారణంగా హైదరాబాద్ వాహనదారులకు ఇప్పటి వరకు గంట లేదా రెండు గంటల పాటు జంక్షన్ లో జామ్ అవ్వడమే తెలుసు. కాని బుధవారం కురిసిన భారీ వర్షం ప్రజలకు ఎప్పటికి గుర్తుండి పోయే అనుభవాన్ని మిగిల్చింది. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచి, కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరేలా చేసింది.
బుధవారం ఉదయం ఆరు గంటలు దాటింది.

ఉద్యోగులు, విద్యార్ధులు ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేందుకు హడావుడిగా రెడీ అవుతున్నారు.  అప్పుడే భారీ వర్షం ప్రారంభమైంది. ఆగకుండా ఐదు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. దీంతో వారంతా తమ విధులకు హాజరయ్యేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షం కారణంగా రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. రహదారులపై గుంతల కారణంగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వచ్చేందుకు రెండుగంటలు, దిల్ షుక్ నగర్ వెళ్లేందుకు నాలుగున్నర గంటల సమయం పట్టిందంటే ట్రాఫిక్‌ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


పెరిగిన జనాభాకు అనుగణంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించక పోవడం సమస్యకు ప్రధాన కారణం. భాగ్యనగరంలోని డ్రైనేజీ వ్యవస్థ కేవలం 20మి.మీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. అలాంటి బుధవారం 60.మి.మీ.లకు పైగా వర్షం పడటంతో.. నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రోడ్లపై మోకాళ్ల లోతు వరద నిలిచిపోవడంతో.. ద్విచక్ర వాహనాలు, కార్ల ఇంజిన్‌లోకి నీరు చేరి  రోడ్డు మధ్యలో మొరాయించాయి.  ఇలా ఒకదాని వెనుక ఒకటి నిలిచిపోవడంతో.. పలుచోట్ల విపరీతమైన రద్దీ నెలకొంది. ఉన్న వరద నీటికి తోడు.. మ్యాన్‌హోల్స్‌ నుంచి నీరు భారీగా రోడ్లపైకి రావడంతో... వాహనదారులు ముందుకెళ్లలేక .. వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడ్డారు. పారిశుద్ధ్య కార్మికులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫ్రిక్‌ సిబ్బంది ఎక్కడికక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 


చివరకు ప్రకృతి కరుణించి.. వర్షం తగ్గడంతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రోడ్లపై మ్యాన్ హోళ్లను గుర్తించి.. వాటిని ఓపెన్ చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఇంతా చేసినా.. రోడ్లపై ఉన్న వర్షపు నీరు పోయిందేకు రెండు నుండి మూడు గంటల సమయం పట్టింది. నగరంలోని అస్థవ్యస్థమైన డ్రైనేజీ వ్యవస్థను చూసి ప్రజలు మండిపడుతున్నారు. జనాభాకు అనుగుణంగా వ్యవస్థలో మార్పు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నాయని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడతారా..? వాన కష్టాల నుంచి భాగ్యనగర వాసులకు ఊరట కలిగిస్తారా..? చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: