భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దులో యుద్ధ వాతావరణం
న్యూఢిల్లీ: 
భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దు వేడెక్కింది. అక్క‌డ‌ యుద్ధ వాతావరణం నెల‌కొంది. 778 కిలోమీట‌ర్ల నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఇండియ‌న్ ఆర్మీ అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తోంది. ప్ర‌భుత్వం క‌నుసైగ చేసినా.. ర‌ణ‌రంగంలోకి దూక‌డానికి సిద్ధంగా ఉంది. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ ఆర్మీ ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మ్యాప్‌ల‌తో స‌హా యుద్ధ ప్ర‌ణాళిక‌ల‌ను కూడా వివ‌రించారు ఆర్మీ అధికారులు. నేష‌న‌ల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్‌తో మ‌రో 2అత్యున్న‌త‌స్థాయి స‌మావేశాలు కూడా జ‌రిగాయ‌ని, నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ప‌రిస్థితి, ఆర్మీ బ‌ల‌గాల మోహ‌రింపుతో పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చే అంశాల‌పై 2 రోజుల పాటు సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  ఇప్ప‌టికే ఉగ్ర‌వాదుల క్యాంపులు, పాకిస్థాన్‌లోని కొన్ని కీల‌క‌ప్రాంతాల‌పై దాడులు నిర్వ‌హించే అంశం ప్ర‌భుత్వ ప‌రిశీలన‌లో ఉంది. ఒక‌వేళ దౌత్య‌ప‌రంగా భార‌త్ అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోతే యుద్ధానికి సిద్ధ‌మ‌న్న సంకేతాలు పంపించే ఉద్దేశంతోనే అద‌న‌పు బ‌ల‌గాల మోహ‌రింపు చేప‌డుతున్నారు. 


యుద్ధానికి రెడీ: పాకిస్థాన్‌


ఇస్లామాబాద్‌: 
క‌య్యానికి కాలు దువ్వుతోంది పాకిస్తాన్. భార‌త్‌లో ల‌క్ష్యాల‌ను ఎంచుకున్నామ‌ని, అటు నుంచి ఏ చిన్న దాడి జ‌రిగినా బ‌లంగా తిప్పికొడ‌తామ‌ని పాకిస్థాన్ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే యుద్ధ ప్ర‌ణాళిక‌తో సిద్ధంగా ఉన్నామ‌ని పాక్ చెప్పిన‌ట్లు జియో టీవీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. బ‌ల‌గాల‌ను మోహ‌రించామ‌ని, యుద్ధం జ‌రిగితే దాడి చేయాల్సిన ల‌క్ష్యాల‌ను కూడా ఎంచుకున్నామ‌ని ర‌క్ష‌ణ వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్లు ఆ టీవీ రిపోర్ట్ తెలిపింది. స‌మీప భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా పాకిస్థాన్ సైన్యం మాత్రం ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగానే ఉంటుంద‌ని ర‌క్ష‌ణ‌శాఖ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. త‌మ సత్తా ఏంటో భార‌త్‌కు తెలుస‌ని కూడా పాక్ హెచ్చ‌రించింది. భార‌త్ కూడా స‌రిహ‌ద్దులో బ‌ల‌గాల‌ను భారీగా మోహ‌రిస్తోంది. ఓవైపు దౌత్య ప‌రంగా పాక్‌పై ఒత్తిడి తెస్తూనే.. మ‌రోవైపు అవ‌స‌ర‌మైతే తుపాకీతోనూ స‌మాధాన‌మివ్వ‌డానికి భార‌త్ సిద్ధ‌మ‌వుతోంది.


పాకిస్థాన్‌లో రష్యా దళాలు - తొలి సంయుక్త విన్యాసాలు 


ఇస్లామాబాద్‌:
‘ఫ్రెండ్‌షిప్‌-2016’ పేరుతో రష్యా, పాకిస్థాన్‌ సైనిక దళాలు నిర్వహించనున్న తొలి సంయుక్త విన్యాసాల నేపథ్యంలో రష్యా సైన్యానికి చెందిన బృందం పాకిస్థాన్‌కు చేరుకుంది. వీరి డ్రిల్‌ రేపు ప్రారంభంకానుంది. గతంలో ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులుండగా.. ఇప్పుడు సైనిక సంబంధాలు మెరుగుపడుతున్నాయని తెలియజేయడానికి ఇరు దేశాలు సంయుక్తంగా డ్రిల్‌ నిర్వహిస్తున్నాయి. ఈ డ్రిల్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్నాయి. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 10వరకు జరిగే పాక్‌-రష్యా జాయింట్‌ డ్రిల్‌ కోసం రష్యాలోని కాంటిజెంట్‌ ఆఫ్‌ రష్యన్‌ గ్రౌండ్‌ దళాలు పాక్‌కు చేరుకున్నట్లు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆసిమ్‌ బజ్వా ట్విట్టర్‌లో వెల్లడించారు.  


జయలలిత కోలుకోవాలంటూ ప్రముఖుల సందేశాలు


చెన్నై: 
అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకోవాలని పలువురు ప్ర‌ముఖులు తమ సందేశాలను పంపుతున్నారు. జయలలిత త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందేశంలో తెలిపారు. తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, డీఎంకే అధినేత కరుణానిధి, సినీనటుడు కమల్‌హాసన్‌ తదితరులు సందేశాలు పంపించారు. తీవ్ర జ్వరంగా ఆస్పత్రిలో చేరిన జయలలితకు జ్వరం తగ్గిందని.. ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని అపోలో వైద్యులు ప్రకటన చేశారు. ఆస్పత్రిలో జయలలిత సన్నిహితురాలు శశికళతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు ఉన్నారు.


టీవీ షోలో అన్నాహజారే


ముంబయి:
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కపిల్‌ శర్మ నిర్వ‌హిస్తున్న‌ షోలో పాల్గొననున్నారు. తనపై తీస్తున్న బయోపిక్‌కి ప్రచారంలో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు షోకి సంబంధించిన షూటింగ్‌ శుక్రవారం జరుగుతుందని షో నిర్వాహకులు తెలిపారు. అన్నా హజారే టీవీ షోలో పాల్గొనటం ఇదే తొలిసారి. అన్నాహజారే జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ‘అన్నా: కిసాన్‌ బాబురావ్‌ హజరే’ చిత్రాన్ని రైజ్‌ పిక్చర్చ్‌ సంస్థ నిర్మిస్తుండగా డైరెక్టర్‌గా శశాంక్‌ ఉడపుర్కర్‌ వ్యవహిరిస్తూ అన్నా హజారే పాత్రను పోషిస్తున్నారు. 


పీడీపీ ఎంపీ రాజీనామా! 


శ్రీనగర్‌: 
కశ్మీర్‌లో చెల‌రేగుతున్న‌ అల్లర్లను నియంత్రించడంలో కేంద్రం, జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ పీడీపీ ఎంపీ తారిఖ్‌ హమీద్‌ కర్రా తన రాజీనామా చేశారు. గతవారం లోక్‌సభ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. శుక్రవారం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రస్తుతం ఆయన శ్రీనగర్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు.  


రజనీకాంత్‌ను కలిసిన ధోనీ 


చెన్నై: 
భారత క్రికెటర్ ఎమ్మెస్‌ ధోనీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కలిశారు. చెన్నైలో నిర్వహించిన ‘ఎమ్‌.ఎస్‌. ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ మూవీ ప్ర‌మోష‌న్ లో ధోనీ పాల్గొన్నాడు. అనంతరం హీరో సుషాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తదితరులతో రజనీకాంత్‌ను కలిసి ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ధోనీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘రజనీకాంత్‌ సార్‌తో’ అని పోస్ట్‌ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: