మరో వారం రోజుల పాటు వ‌ర్షాలు: తెలంగాణ విప‌త్తు నియంత్ర‌ణ శాఖ
హైద‌రాబాద్:
ఇప్ప‌టికే అత‌లాకుత‌లం చేస్తున్న భారీ వాన‌లు మ‌రో వారం రోజుల పాటు బీభ‌త్సం సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, తెలంగాణ‌లో మ‌రో 7రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలంగాణ విప‌త్తు నియంత్ర‌ణ శాఖ తెలిపింది. ఈనెల 27 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు, 27 నుంచి 30 వ‌ర‌కు ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఏపీలోనూ ఇంచుమించు ఇదే త‌ర‌హాలో వ‌ర్షాలు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. మ‌రోవైపు, హైద‌రాబాద్‌లో కురుస్తోన్న వర్షాల‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వ‌దంతుల‌ను న‌మ్మొద్దని జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ సూచించారు. ఇంకా వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు.


‘హుస్సేన్ సాగర్’ను పరిశీలించిన కేటీఆర్


హైదరాబాద్: 
ప్రమాదస్థాయికి చేరిన హుస్సేన్ సాగర్ను మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు నగరం నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం హుస్సేన్‌ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం(513 అడుగులు) కొనసాగుతుందని గుర్తించిన మంత్రి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు  లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. 


25న ఎన్ఆర్ఐలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్


హైదరాబాద్: 
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ఎన్ఆర్ఐలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారితో ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడనున్నారు.


దసరానుంచీ తెలంగాణలో మినీ ఏసీ బస్సులు

హైదరాబాద్ః 
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ ఆర్టీసీ) కొత్తగా మూడు పట్టణాల్లో మిని ఏసీ బస్సుల సేవలను ప్రవేశ పెడుతోంది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ కొత్త బస్సులను రాష్ట్రంలోని  హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో ప్రారంభిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇటువంటి మినీ ఏసీ బస్సులను ప్రవేశ పెట్టడం దేశంలోనే ఇదే మొదటిసారని.. ఈ సేవలు అక్టోబర్ 11న ద‌స‌రా సంద‌ర్భంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు.


విభ‌జ‌న గురించి ఆనాడు సోనియా నాకు స్వయంగా చెప్పారు: వెంకయ్య


రాష్ట్రాన్ని విడదీస్తున్న విషయాన్ని స్వయంగా సోనియాగాంధీ నాడు తనకు చెప్పారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ ఆ మాట నాకు చెప్పారు. సమైక్యాంధ్రా కాదు, ఏపీకి ఏం కావాలో అడగాలని చాలామంది నాయకులకు నేను చెప్పాను. విభజన బిల్లు సరిగ్గా రూపొందించి ఉంటే ఇబ్బందులు తలెత్తేవి కావు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు నేను చాలా కృషి చేస్తున్నాను. చాలా మంది నాయకులు తమ హోదాను పెంచుకునేందుకు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ప్రాంతీయ భేదాలు లేవు.. నేను జాతీయవాదిని’ అని వెంకయ్య అన్నారు.


హైదరాబాద్‌కు 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు


 హైదరాబాద్: 
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ‌నివారం హైదరాబాద్‌కు రానున్నాయి. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టనున్నాయి. ఒక్కో టీంలో 40మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండనున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తక్షణం వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ సహకారం అందించాలని కల్నల్ జీబీఎంయూ రావుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: