ఎడతెరపి లేని వర్షాలు నగరాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం కొంత తెరిపి ఇచ్చాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ రాత్రి నుంచి మొదలు కావడం పలు ప్రాంతాల్లో జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనేక ప్రాంతాలు వరద, బురద, మురుగు నీటిలో నాలుగు రోజులుగా మగ్గిపోతున్నాయి. అరగంట, గంటపాటు వర్షం తెరిపి ఇస్తున్నా ...అంతలోనే మళ్లీ విరుచుకు పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. గురువారం రాత్రి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం ఒక మోస్తరు జల్లులు పడగా.. మళ్లీ రాత్రి నుంచి భారీ వర్షం ప్రారంభమవడంతో అనేక ప్రాంతాలు ముంపు ముప్పులోకి వెళ్లిపోయాయి.


Image result for hyd rain

ఇప్పటికే వరుణుడి ఆగ్రహానికి గురై, గడచిన నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్న తెలుగువారికి మరిన్ని రోజుల పాటు వాన ఇబ్బందులు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికితోడుగా విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


Image result for hyd rain

ఇప్పటికీ హైదరాబాద్ లోని పలు లోతట్టు కాలనీల్లోని అపార్టుమెంట్లు వరదముంపు నుంచి బయట పడలేదు. ఈ సమయంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వస్తున్న వార్తలతో ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.


Image result for hyd rain

పరిస్థితులు ఇలాగే కొనసాగితే వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం దోమల ఉద్ధృతికి పూర్తి అనుకూలంగా ఉంది. శుక్రవారం సమీక్ష సమావేశంలో.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు నిజాంపేట బండారి లేఅవుట్‌లోని అందర్నీ ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. చాలా ముంపుప్రాంతాల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోవడంతో విద్యుత్తు అధికారులు సరఫరాను నిలిపివేశారు. వీటిలో ఉన్న వారు చీకట్లోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. ముంపు నీరు వెళ్లిపోతేనే విద్యుత్తు సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: