భార‌త్ ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతోందా? భార‌త్‌ను డైరెక్టుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కొత్త త‌ర‌హా యుద్ధం ప్ర‌క‌టిస్తున్నారా? బుల్లెట్ పేల‌కుండానే పాకిస్తాన్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు మోడీ రెడీ అవుతున్నారా ? జ‌లాస్త్రంతో పాకిస్తాన్‌కు మోడీ చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా ? అంటే అవున‌నే స‌మాధానాలు ఇప్పుడు విశ్వ‌స‌నీయంగా వినిపిస్తున్నాయి. 


కార్గిల్ త‌ర్వాత మ‌రోసారి ఆ రేంజ్‌లో భార‌త్‌ను క‌వ్విస్తోంది పాకిస్తాన్. సెప్టెంబర్ 18న, ఆదివారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్ ఆర్మీ స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నిద్రలో ఉన్న 18మంది సైనికులు వీరమరణం పొందారు. వంద‌ల సైనికులు తీవ్ర గాయాలకు గురయ్యారు. గత 20 ఏళ్ళల్లో మన సైనిక స్థావరంపై నేరుగా దాడి జరపడం, ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మృతి చెందడం మొత్తం దేశ ప్రజలలో తీవ్ర ఆగ్రవేశాలు కలిగిస్తున్నది. ఈ ఘ‌ట‌న‌పై భార‌తీయుల ర‌క్తం ఉడుకుతోంది. పాక్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ చాలా మంది ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్ పై ఉగ్రవాదులు దాడి జరిపిన సందర్భంలో సహితం మొత్తం దేశ ప్రజలు ప్రతీకారం తీర్చుకోవాలని, పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపాలని ఆగ్రహంతో ఊగిపోయారు. సైన్యాధిపతులు సహితం అటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఆ దిశలో కొంతమేరకు ప్రయత్నం జరిగినా, చెప్పుకోదగిన పరిణామాలు జరుగని లేదు.

ఇప్పుడు దేశంలో అటువంటి వాతావరణం కనిపిస్తున్నది. యూరీ సెక్టార్ లో దాడి జరుగగానే రష్యా పర్యటనకు బయలుదేరనున్న హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన పర్యటనను రద్దు చేసుకొని ఇక్కడనే ఉండిపోయారు. రోజులతరబడి సైన్యాధిపతులతో, భద్రత వ్యవహారాల అధిపతులతో, మంత్రుల బృందం, ప్రధానమంత్రితో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. గత ప్రభుత్వాల వలే మాటలు, వరుస సమావేశాలతో కాలం గడుపకుండా సత్తా చూపించవలసిన అవకాశం మోడీకి లభించింది. అయితే దాడి జరుగగానే ట్వీట్ ద్వారా ఖండించడం మినహా ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలు ఇప్పుడు వినబడటం లేదు. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు కనబడటం లేదు. ఈ సందర్భంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపాలనే అంశాలు ప్రభుత్వ, సైనిక వర్గాల నుండి వెలుగులోకి వస్తున్నా.. ప్రభుత్వం నిర్దుష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి కావడం లేదు.


 ఈ విష‌యంలో ప్ర‌ధాని మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. మోడీ ఏ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నేది భార‌త్‌, పాకిస్తాన్‌తో స‌హా ప్ర‌పంచ‌దేశాలు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి. స‌రిగ్గా ఇదే వేళ మోడీ ఎవ‌రూ ఊహించ‌ని ఓ స‌రికొత్త యుద్ధం ద్వారా పాక్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. పాక్‌పై యుద్ధం చేయ‌కుండానే.. ఒక్క చిన్న బుల్లెట్ కూడా పేల్చ‌కుండానే.. తుపాకులే ఎక్కు పెట్టాల్సిన అవ‌స‌రం లేకుండా పాక్‌కు కంట్రోల్లోకి తెచ్చేందుకు ఆయ‌న ప్లాన్ వేస్తున్నార‌ని తాజాగా వినిపిస్తున్న స‌మాచారం. భార‌త్‌-పాకిస్తాన్ స‌రిహ‌ద్దులో పంచ‌నదులు ప్ర‌వ‌హిస్తుంటాయి. సింధూ న‌దితో పాటు దీని ఉప‌న‌దులు అయిన జీలం-చినాబ్‌-బియాస్‌-రావి-స‌ట్లెజ్ న‌దులు ఈ స‌రిహ‌ద్దులో ప్ర‌వ‌హిస్తుంటాయి. దాదాపు 56 సంవ‌త్స‌రాల క్రితం ఈ రెండు దేశాల మ‌ధ్య సింధూ న‌దీ జ‌లాల ఒప్పందం జ‌రిగింది. ఈ ఒప్పందం ప్ర‌కారం 80 శాతం నీటిని వాడుకుంటోంది. ఈ ఒప్పందం ప్ర‌కారం పంచ న‌దుల్లో బియాస్, రావి, సట్లేజ్ నదులపై భారత్‌కు హక్కులున్నాయి. జమ్ము కాశ్మీర్‌నుంచి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు కంట్రోల్ ఉంటుంది.


ఇప్పుడు మోడీ ఈ ఒప్పందాన్ని పాక్‌కు చెప్ప‌కుండానే ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. అదే జ‌రిగితే పాక్‌కు నీరు వెళ్ల‌దు. 80 శాతం జ‌లాల‌పై ఉన్న పాక్‌లో ల‌క్ష‌లాది ఎక‌రాలకు నీళ్లు లేక‌.. పంట‌లు పండ‌క పాక్ ఎడారిగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో మోడీ స‌ర్కార్ ఈ ఒప్పందాన్ని నిర్దాక్షిణ్యంగా ర‌ద్దు చేసుకుని ఈ జ‌లాస్త్రం ద్వారా పాక్‌కు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

నిజానికి పాకిస్తాన్ పై ఇప్ప‌టికిప్పుడు ప్ర‌త్య‌క్ష‌ యుద్ధం జరపడంపైన కన్నా మన సైన్యాన్ని ఆధునీకరణ కావించడం, నిఘా వ్యవస్థను మెరుగుపరచడం, సరిహద్దులలో భద్రతను మరింతగా పటిష్ట పరచడం, కాశ్మీర్ లోయలో రాజకీయ సుస్థిరతతో పాటు చొరబాటుదారుల ప్రవేశాన్ని కట్టడి చేయడం పట్ల దృష్టి పెట్టాల్సిన స‌మ‌య‌మిది. అంత‌ర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేయ‌డం ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ముందున్న క‌ర్త‌వ్యం, జ‌లాస్త్రంతో మోడీ త‌న చ‌తుర‌త చూపించాల్సిన సంద‌ర్భం. భార‌త్‌తో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో ప‌రోక్షంగా పాక్‌కు తెలిసేలా చెప్పే స‌మ‌యం. 


మరింత సమాచారం తెలుసుకోండి: