ప్రపంచ దేశాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా అగ్ర రాజ్యమైన అమెరికాలో ఈ గన్ కల్చర్ విశృంఖలాలకు దారి తీస్తుంది.  గత కొంత కాలంగా అమెరికాలో విపరీతంగా గన్ కల్చర్ పెరగడంతో ఎక్కడ పడితే అక్కడ కాల్పులు మొదలయ్యాయి.  మరోవైపు ఉగ్రవాదుల దాడి..ఇలా ఎప్పుడు ఏం జరుగుతుంతో అని అక్కడ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మూడు రోజుల క్రితం భారీ స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ సంఘటన మరిచిపోక ముందే..తాజాగా మళ్లీ కాల్పుల కలకలం రేగింది.  

జనంతో రద్దీగా ఉండే కాస్కేడ్‌ మాల్‌లో శుక్రవారం అకస్మాత్తుగా జరిగిన తుపాకీ పేలుళ్లు భీతావహ వాతావరణాన్ని కల్పించాయి. ఓ అగంతకుడు కాల్పులు జరిపినట్లు వాషింగ్టన్ స్టేట్ పోలీసులు ట్విటర్‌లో తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. 1990లో బర్లింగ్టన్‌లో ప్రారంభమైన కాస్కేడ్ మాల్‌లో జేసీ పెన్నీ, టీజే మాక్స్, మేసీస్ స్టోర్స్, మరికొన్ని స్టోర్లు, రెస్టారెంట్లు, ఒక థియేటర్ ఉన్నాయి.

దీంతో అక్కడకు స్థానికులు బాగానే వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరగడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు.  కాల్పులకు పాల్పడిన వ్యక్తి గ్రే కలర్ దుస్తులు ధరించిన అగంతకుడి కోసం గాలింపు జరుగుతోందని సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ చెప్పారు. ఆ నిందితుడిని చివరిసారిగా ఇంటర్‌స్టేట్ 5లో చూసినట్లు తెలిపారు. మాల్‌లో గాయపడినవారికి చికిత్స చేసేందుకు వైద్యులను పంపించినట్లు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: