వ‌ర్షాల‌తో అంతా అతలాకుతలం 

హైద‌రాబాద్:

తెలుగు రాష్ట్రాల‌ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. నాలుగైదు రోజులుగా విస్తారంగా వానలు పడుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 10 మంది మృత్యువాతపడ్డారు. రహదారులపై వరద ఉద్ధృతికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ జిల్లాల్లో 50 శాతం పైగా చెరువులు నిండాయి. వరద తీవ్రత పెరుగుతుండడంతో చెరువులకు గండ్లు పడుతున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


మూడు జిల్లాల్లో హై అలర్ట్


హైదరాబాద్: 
తెలంగాణలోని 3 జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదతో శనివారం సాయంత్రానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. దిగువ ప్రాంతాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్.. ఈ మూడు జిల్లాల‌ను హై అల‌ర్ట్ ప్ర‌క‌టించి, వారిని అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 


హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు 


అమ‌రావ‌తి:
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అతలాకుతలమైన గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. గుంటూరు జిల్లాలోని గురజాల, పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్లలో ముంపు ప్రాంతాలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ధాటికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ ను ఆయన పరిశీలించారు. 


వరద ప్రాంతాల్లోకి వైఎస్ జగన్


విజయవాడ:
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరదల దాటికి పంట నష్టపోయిన రైతులతో పాటు ఇతర బాధితులను ఆయన పరామర్శించనున్నారు.
 

జగన్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధమా?


విజయవాడ :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్‌సీపీ సవాలు విసిరింది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో ముఖాముఖి చర్చించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా అని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు వస్తానంటే.. తాము విజయవాడలోనైనా, కుప్పంలోనైనా చర్చకు సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు.


ఘనంగా ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్ షురూ


హైదరాబాద్‌: 
రామోజీ ఫిలింసిటీలో ‘ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌’ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా ప్రారంభమైంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఇండీవుడ్‌ వేదిక రూపకర్త సోహన్‌ రాయ్‌ తదితరులు ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వివిధ చిత్ర పరిశ్రమలను ఏకతాటిపైకి తేవడమే ఇండీవుడ్‌ కార్నివాల్‌ ఉద్దేశం. ఈ కార్నివాల్‌లో 80కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 4 రోజులపాటు జరిగే కార్నివాల్‌లో 132కిపైగా సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ఇండీవుడ్‌ కార్నివాల్‌కు రామోజీ ఫిల్మ్‌సిటీ వేదిక కావడం సంతోషంగా ఉందని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అన్నారు. 


మ్యాన్‌హోల్‌ నుంచి క్షేమంగా బయటికి..


హైదరాబాద్‌: 
నగరంలోని నిజాంపేటలో శనివారం ఓ యువకుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. శ్రీనివాస్‌నగర్‌లోని ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లోకి జారిపడ్డాడు. భారీ వర్షాల నేపథ్యంలో రహదారి పూర్తిగా వరద నీటిలో మునగడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ యువకుడు వాహనంతో సహా మ్యాన్‌హోల్‌కు దిగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతడ్ని రక్షించడంతో అత‌డు బ‌తికాడు.


ఏపీకి ప్యాకేజీ తీసుకోవడం తప్పా?: చంద్రబాబు


విజయవాడ:
హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే తీసుకోవడం తప్పా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరానికి నాలుగేళ్లలో 30వేల కోట్లు ఇస్తుంటే తీసుకోవద్దా?.. డబ్బులు లేనప్పుడే ఎన్నో పనులు చేశామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. డబ్బులుంటే ఇంకా అనేక పనులు చేయవచ్చన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని ఉపేక్షించవద్దని చంద్రబాబు తేల్చిచెప్పారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తానని చంద్రబాబు చెప్పారు.


జైపాల్ రెడ్డికి ఉండ‌వ‌ల్లి కౌంట‌ర్


రాజమహేంద్రవరం: 
రాష్ట్ర విభజనపై తాను రాసిన పుస్తకం కట్టుకథ అంటూ కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చేసిన విమర్శలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘నాది కట్టుకథే. నేను ఊహించి రాసిందే. విశ్లేషణ మాత్రమే. నాడు స్పీకర్‌ చాంబర్‌లో సుష్మాస్వరాజ్‌, కమలనాథ్‌ మధ్య రాజీ కుదిర్చానని మీరే చెప్పా రు. అసలు లోపల ఏంజరిగింది? ఇప్పటికైనా నిజాలు చెప్పండి’’ అని డిమాండ్‌ చేశారు. నిజాలు చెప్తే ప్రజలకు కాస్తయినా ఉపశమనం కలుగుతుందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: