మరో ఐదు రోజులు వర్షాలే

హైదరాబాద్‌: 

తెలుగు రాష్ట్రాలకు వరుణుడి ముప్పు ఇంకా తొలగలేదు. రాగల 5 రోజుల వరకు రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కాస్త బలహీనపడి అల్పపీడనంగా మారిందని అధికారులు తెలిపారు. విదర్భను ఆనుకుని తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్రలో 5రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. 28. 29 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు.


అన్ని శాఖలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్ 


హైదరాబాద్: 
భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆస్తి నష్టం జరిగితే ఎలాగోలా పూడ్చుకోవచ్చు.. కానీ ప్రాణ నష్టం జరిగితే పూడ్చలేమని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలన్నారు. అవసరమైన సూచనలను చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల పట్టణాలు, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని ఆదేశించారు.  


బాధితులంద‌రికీ ప‌రిహారం అందించాలి: చ‌ంద్ర‌బాబు 


విజ‌య‌వాడ‌: 
గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో  హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్న ఏపీ సీఎం చంద్రబాబు అంతకుముందు తన నివాసం నుంచి ఆ జిల్లాకు చెందిన అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. వరద నీటి కారణంగా ముంపునకు గురైన  గురజాల, మాచర్ల, న‌ర‌స‌రావుపేట‌, పెదకూరపాడు తదితర ప్రాంతాల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో సర్పంచి నుంచి  గ్రామ‌  కార్యదర్శులందరితోనూ ఒకే సారి టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పునరావాసం, సహాయ చర్యలు సకాలంలో అందితేనే ప్రజలకు సంతృప్తి కలుగుతుందని  వ్యాఖ్యానించారు. భారీ వర్షాలలో నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించాలని స్పష్టం చేశారు.


చంద్రబాబుకు అంత కోపం ఎందుకు: ముద్రగడ


కాకినాడ:
కాపు జాతికిచ్చిన హామీని అమలు చేయమంటే సీఎం చంద్రబాబుకు ఎక్కడాలేని కోపమెందుకు రావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిలదీశారు. కాపు జాతికి 2014 ఎన్నికల క్రమంలో బీసీల్లో చేర్చి రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు హమీ అమలు చేయడంలేదని ఆరోపించారు. తమ జాతి ఆర్థికంగా పడుతున్న బాధలు, అవస్థలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకే తుని ఐక్యగర్జన సభ నిర్వహించినట్టు తెలిపారు. తమ జాతికి ఇచ్చిన హామీ అమలు కోసం తాము చేపట్టిన ఉద్యమం నీరు గార్చాలని తమ జాతిని విడదీసి రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. కాపు ఉద్యమం పుట్టడానికి మూలకారకులు చంద్రబాబేనని ముద్రగడ ఆరోపించారు.


5.5 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్‌ 


అమరావతి:
‘వనం మనం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 5.5లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేశారు. సీఎం చంద్రబాబు పిలుపుతో విద్యార్థులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 315 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా 1,09,837 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఏలూరులో సీఎం చంద్రబాబు స్వయంగా వనం మనం ర్యాలీలో పాల్గొని ఉద్యమం తరహాలో దీనిని చేపట్టాలని పిలుపునిచ్చారు. 


వచ్చే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా: సింధు


పశ్చిమ‌గోదావ‌రి : 
వచ్చే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తానని పీవీ సింధు ధీమావ్యక్తం చేశారు. క్రీడలకు ప్రోత్సాహం పెరుగుతోందని, పాటీల్లో పాల్గొనే మహిళలకు మరింత శిక్షణ ఇస్తే బంగారు పతకాలు గెలవడం ఖాయమని సిల్వర్ పథక విజేత పీవీ సింధూ అన్నారు. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలవడం సంతోషంగా ఉందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: