స‌రికొత్త రికార్డు సృష్టించిన‌ అశ్విన్ 
కాన్పూర్‌: 
టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ స‌రికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. భార‌త్ త‌ర‌ఫున టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ క్రికెట్‌లో అత‌ను రెండోస్థానంలో నిలిచాడు. భార‌త్ త‌ర‌ఫున 37వ టెస్టు ఆడుతున్న అశ్విన్‌.. 25 స‌గ‌టుతో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కాన్పూర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో మూడో వికెట్ తీయగానే 200 వికెట్ల క్లబ్ లో చేరాడు. భారత్ తరఫున అశ్విన్ కంటే ముందు హర్భజన్ సింగ్ 46 టెస్టుల్లో 200 వికెట్లు తీసుకున్నాడు.
స్పీడ్‌గా 100 వికెట్లు తీసుకున్న భారత బౌలర్ కూడా అశ్వినే కావడం విశేషం. తన 18వ టెస్టులోనే అశ్విన్ 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.


 అరుదైన, అద్భుత‌మైన‌ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం


శ్రీహరికోట:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అరుదైన, అద్భుత‌మైన‌ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి నింగిలోకి ఎనిమిది ఉపగ్రహాలను పంపి..వాటిని ఒకేసారి వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమ‌వారం ఉదయం 9.12గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ35 రాకెట్ ను శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందం పీఎస్‌ఎల్వీ-సీ35 రాకెట్ ద్వారా స్కాట్ శాట్-1 ఉపగ్రహంతోపాటు మరో 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేసింది.


త‌ప్పు పాక్ దే - సాక్ష్యాలివిగో..


శ్రీన‌గ‌ర్‌: 
యూరి దాడితో త‌మ‌కు ఏ సంబంధం లేద‌ని పాకిస్థాన్ త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నా.. దాయాదిని పూర్తి సాక్ష్యాధారాల‌తో ఇరికించ‌డానికి నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సిద్ధ‌మవుతోంది. తాజాగా యూరి దాడి పాక్ ప‌నేన‌ని చెప్ప‌డానికి తిరుగులేని సాక్ష్యాలు సంపాదించింది ఎన్ఐఏ. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్ర‌వాదులు వాడిన వైర్‌లెస్ సెట్స్ ఇప్పుడు కీల‌క ఆధారంగా మారాయి. జ‌పాన్‌లో త‌యారైన ఈ వైర్‌లెస్ సెట్స్‌పై బిల్‌కుల్ న‌యా (బ్రాండ్ న్యూ) అని ఉర్దూలో రాసి ఉంది. వీటిని తయారు చేసిన ఐకామ్ కంపెనీ నుంచి కొనుగోలుకు సంబంధించిన వివ‌రాల‌ను ఇప్ప‌టికే ఏజెన్సీ అధికారులు తీసుకున్నారు. సాధార‌ణంగా దేశాల భ‌ద్ర‌తా సంస్థ‌ల‌కు మాత్ర‌మే అమ్మే ఈ వైర్‌లెస్ సెట్స్ ఉగ్ర‌వాదుల ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌చ్చాయ‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంది. ఈ మోడ‌ల్స్‌ను పాకిస్థాన్‌లోనే విక్ర‌యించిన‌ట్లు ఆధారాలు సేక‌రించామ‌ని, వాటిని పాక్ అధికారులకు పంపిస్తామ‌ని కేంద్ర హోంశాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దాడిలో మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదుల నుంచి ఈ వైర్‌లెస్ సెట్స్ స‌హా మొత్తం 48 వ‌స్తువుల‌ను విచార‌ణాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు మ్యాపులు, ఉగ్ర‌వాదులు వాడిన ఆహార ప‌దార్థాలు, జీపీఎస్ ప‌రిక‌రాలు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. వారు వాడిన ఆహార ప‌దార్థాలు, జ్యూస్‌లు కరాచీలో త‌యారైన‌ట్లు స్ప‌ష్టంగా ఉంది. ఇక అక్క‌డ ల‌భించిన కోడ్ నంబ‌ర్లు 8440, 8605, 2842, 3007ల‌ను ఛేదించే ప‌నిలో నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రీసెర్చ్ లేబొరేట‌రీ అధికారులు ఉన్నారు. 


ఆర్మీని చూసి గర్విస్తున్నా: మోదీ


న్యూఢిల్లీ: 
ఆర్మీ మాట్లాడ‌ద‌ని, వాళ్ల శౌర్య ప‌రాక్ర‌మాలే మాట్లాడ‌తాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. సాధార‌ణ ప్ర‌జ‌లు, నేత‌లు ఏ అవ‌కాశం దొరికినా ఏదో ఒక‌టి మాట్లాడ‌తార‌ని, ఆర్మీ అలా కాద‌ని ఆయ‌న చెప్పారు. త‌న 24వ ఎడిష‌న్ మ‌న్ కీ బాత్‌లో భాగంగా మోడీ రేడియోలో మాట్లాడారు. యూరి ఘ‌ట‌న‌లో అసువులు బాసిన అమ‌ర జ‌వాన్ల‌కు సంతాపం తెలిపారు. ఈ దాడి వెన‌క ఉన్న వారు త‌ప్పించుకులేర‌ని, వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మోడీ స్ప‌ష్టంచేశారు. మ‌న ఆర్మీపై త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని, మ‌న జ‌వాన్ల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. క‌శ్మీరీ ప్ర‌జ‌ల భ‌ద్ర‌త పాల‌కుల చేతుల్లో ఉంద‌ని, దానిని స‌రిగా నిర్వ‌ర్తించేలా అడుగులు వేయాల‌ని సూచించారు. 


గ్ర‌హాంతర వాసుల‌పై స్టీఫెన్‌ హాకింగ్స్ సంచ‌ల‌న వ్యాఖ్యలు


గ్ర‌హాంతర వాసుల ఉనికిపై ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్స్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. విశ్వంలో కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో గ్రహాంతరజీవులు వుండే అవకాశముందని స్టీఫెన్‌ హాకింగ్స్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే వారు మన వునికిని గుర్తిస్తే భూగ్రహానికి ప్రమాదం ఎదురయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ‘స్టీఫెన్‌ హాకింగ్స్‌ ఫేవరెట్‌ ప్లేసస్‌’ అనే డాక్యుమెంటరీ ద్వారా ఆయన ఈ విశేషాలను వెల్లడించారు. మనకు 16 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక గ్రహం నుంచి ఎప్పటికయినా సిగ్నల్స్‌ రావచ్చని అయితే మనం తిరిగి స్పందించకూడదన్నారు. వారితో కలయిక మనకు నష్టాన్ని కలిగించవచ్చన్నారు. గ్రహాంతర జీవులు అన్ని రకాలుగా మనకన్నా అభివృద్ధి చెందివుంటారని వారితో సాన్నిహిత్యం భూగ్రహంలో వారి వలసపాలనకు దారి తీస్తుందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: