కత్తి పట్టిన వాడు కత్తికి బలవుతాడు..గన్ పట్టిన వాడు తూటాలకే నేలకొరుగుతాడన్న విషయం గ్యాంగ్ స్టర్ నయీమ్ కి బాగా తెలిసినట్టుంది.. అందుకే తన 6th సెన్స్ కి బాగా పని చెప్పాడు. తన 10ఏళ్ల నేర సామ్రాజ్యంలో ఏమేమి జరిగిందో అక్షరం అక్షరం మిస్ కాకుండా అంతా డైరీలో రాసుకున్నాడు. ఎవరెవరికి ఎంత ఇచ్చింది.. ఎవరితో దోస్తాని చేసింది అందులో ఉంది. ఇప్పుడివే రాజకీయ నాయకులకు, పోలీస్ బాస్‌ల మెడకు చుట్టుకుంది. నయీమ్ డైరీ ఆధారంగా సిట్ ఒక్కొక్కరిని దర్యాప్తు చేయనుంది.

 

తీవ్రవాదం ప్రభావమో.. ఎప్పటికైనా ఉపయోగపడతాయనే ముందుచూపో.. కారణమేదైనా కరుడుగట్టిన నేరగాడు నయీం గత పదేళ్ల కార్యకలాపాలన్నీ పక్కాగా నమోదు చేశాడు. ఎవరు ఏం పనులు అప్పగించారు? ఎవరెవరితో ఎలాంటి లావాదేవీలు నిర్వహించాడు? ఎవరెవరికి ఎప్పుడు ఎంతడబ్బు ఎలా అందజేశాడు? ఇలా ప్రతి విషయాన్నీ పుస్తకాల్లో రాసుకున్నాడు. ఇప్పుడివే పోలీసులు, రాజకీయ నాయకుల పీకలకు చుట్టుకుంటున్నాయి. నయీం డైరీల్లోని వివరాల ప్రకారం వాటిని బలపరిచే ఆధారాలు ఇప్పటికే చాలా వరకూ సిట్‌ అధికారులు సేకరించారు. నయీంతో అంటకాగిన అధికారులు, నాయకులను విచారించే ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.

 

మహబూబ్‌నగర్‌ కు చెందిన బత్తుల ఈశ్వరయ్యను  అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 126 కేసులు నమోదు చేసిన సిట్‌ అధికారులు రెండు మూడు రోజుల్లో మరిన్ని అరెస్ట్లు చేయనున్నారు..ఇప్పటి వరకు 93 మంది అరెస్ట్ చేశారు. అల్కాపురిలోని నయీం ఇంట్లో సైబరాబాద్‌ పోలీసులు సోదాల్లో అనేక పుస్తకాలు, డైరీలు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌ల వంటివాటిని ఫోరెన్సిక్‌ పరిశోధనశాలకు పంపారు. పుస్తకాలు, డైరీల్లోని అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం  అధికారులు విశ్లేషించడం మొదలుపెట్టారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిన తర్వాత.. పదేళ్ల కిందట నుంచి బెదిరించి డబ్బు వసూలు చేయడం, భూములు ఆక్రమించుకోవడం, హత్యలు మొదలుపెట్టాడు. తనను తాను కాపాడుకోవడానికి గతంలోని పోలీసు పరిచయాలను వాడుకున్నాడు. ఈ క్రమంలోనే నయీం శంషాబాద్‌ ప్రాంతంలో రెండేళ్లపాటు నివసించాడు. అతనితో సన్నిహిత సంబంధాలున్న ఓపోలీసు అధికారి సూచన మేరకే శంషాబాద్‌లో ఆశ్రయం పొందాడని, ఆ సమయంలో నయీం 2 హత్యలకు పాల్పడగా ఆ అధికారి వాటిని అనుమానాస్పద మృతిగా నమోదు చేయించి, ఆధారాలు లేవని మూసివేయించినట్లు తెలుస్తోంది. అనేకమంది అధికారులను ఇలా వాడుకుని, భారీగా ముట్టజెప్పాడు. భూవివాదాలు పరిష్కరించమని బాధితులు నాయకుల వద్దకు వచ్చినప్పుడు వారు నయీంను వాడుకునేవారు. అవతలి పక్షాన్ని బెదిరించి సెటిల్‌మెంట్‌ చేసేవాడు. వచ్చిన మొత్తాన్ని నాయకులు, నయీం పంచుకునేవారు. అయితే నయీం చేసిన ప్రతి పనీ నమోదు చేసేవాడు.తనకు సహకరించిన ఓపోలీసు అధికారికి రూ.20 లక్షల చొప్పున అనేకమార్లు ఇచ్చినట్లు డైరీల్లో ఉంది. అనేకమంది అధికారుల ఇళ్లకు నయీం తరచూ వెళ్లేవాడంటూ బలమైన ఆధారాలు సిట్‌ అధికారులు సంపాదించారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి డైరీల్లో లెక్కలేనంత సమాచారం ఉంది.

 

దీంతో వీటిపై సిట్ కసరత్తు ముమ్మరం చేసింది. నయీమ్‌తో లింకులు, ఫొటోల విషయంలో స్పష్టత కోసం అతని కుటుంబీకులు, సన్నిహిత వ్యక్తులను విచారించేందుకు వారిని కస్టడీలోకి తీసుకుంది. నయీమ్ భార్య హసీనా, సోదరి సలీమా, మేనల్లుడు ఫయాజ్, వంటమనిషి ఫర్హానా, కీలక సన్నిహితుడు టెక్ మధు తదితరులను కస్టడీలోకి తీసుకుంది. ఇప్పటివరకు లభించిన ఆధారాలను వారి ముందుంచి మరోసారి విచారించనుంది. నయీమ్ చాలా తెలివిగా తన వద్దకు వచ్చిన ప్రతీ ముఖ్యమైన వ్యక్తిని వారికి తెలియకుండానే ఫొటోలు తీయించాడు. ఇలా అరడజను వరకు పోలీసు ఉన్నతాధికారులు, పదుల సంఖ్యలో డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.. ఆ ఫొటోలన్నీ ఎలాంటి స్టిల్స్ లేకుండా చాలా క్యాజువల్‌గా ఉన్నాయి. నయీమ్‌తో మాటామంతీ జరుపుతున్నప్పుడు వారికి తెలియకుండానే అతని మనుషులు ఫొటోలు తీయడం, వాటిని భద్రంగా దాచిపెట్టడం చూసి విచారణాధికారులే ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు సీసీ కెమెరాల ద్వారా రికార్డయిన వీడియోలను సైతం భద్రపరిచారు.

 

విచిత్రమేమిటంటే కొన్ని సందర్భాల్లో.. నయీమ్ కొందరు పోలీసు అధికారుల ఇళ్లకు వెళ్లి చర్చలు జరిపాడు. ఆ సందర్భంలో కూడా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని కూడా నయీమ్ చాలా జాగ్రత్తగా దాచి ఉంచాడు. కేసుల దర్యాప్తులో భాగంగా అతని డెన్‌లలో సోదాలు నిర్వహించిన పోలీసులకు ఇవన్నీ దొరికాయి. వీటిని పరిశీలించిన ఉన్నతాధికారులు అవి వాస్తవమైనవా..? లేక ఏమైనా మార్ఫింగ్ చేశారా? అనేది తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అక్కడ్నుంచి వచ్చే నివేదిక ఆధారంగా కేసు కీలక మలుపు తిరగనుంది. ఇక నరహంతక ముఠా నయీమ్ గ్యాంగ్‌పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా సిట్‌కు మరో రెండు ఫిర్యాదులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన 40 మంది రైతులు శాంతిభద్రతల అదనపు డీజీ, సిట్ పర్యవేక్షణాధికారి అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూములను నయీమ్ ముఠా లాక్కొందని తెలిపారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన గంగామణి మరో ఫిర్యాదు చేశారు. దశరథ మహారాజ ఆశ్రమానికి చెందిన 26 ఎకరాల 12 గుంటలను నయీమ్ మనుషులు దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె తెలిపారు.

 

నయిమ్ ముఠా బెదిరించిందని ఫిర్యాదు చేసిన వారి వినతి పత్రాలు చూస్తే అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీస్ అధికారులు ఉన్నారట. సిట్ దర్యాప్తులో తేలుతున్న విషయాలు ఎప్పటి కప్పుడు డీజీపీ సీఎం దృష్టికి తీసుకుపోతున్నారు. వీటిపై సీఎం ఇచ్చే ఆదేశాలే కేస్ కి కీలకంగా మరబోతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: