అమరావతికి వరల్డ్ బ్యాంకు అప్పు
అమరావతి: 
ఏపీ నూతన రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు 3,324 కోట్ల రూపాయ‌ల రుణం మంజూరు చేయనుంది. అమరావతిలో రహదారులు, వరద నియంత్రణ, నేలపాడు గ్రామంలో వసతుల కోసం ప్రపంచబ్యాంకు ఆ రుణం ఇవ్వనుంది. ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. 65 కిలోమీటర్ల మేర సబ్-ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో కలిపి మొత్తం రూ.4,749 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.3,324 కోట్లను రుణంగా సమకూర్చుతుంది. మిగతా 1,425 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి నిధులను ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది. ప్రాజెక్టును 2019 కల్లా పూర్తిచేయాలని నిర్ధారించారు.


రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతే.. బాబు విమానాల్లో తిరుగుతున్నారు: జ‌గ‌న్


గుంటూరు: 
పంట‌లు న‌ష్టపోయి ఓవైపు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతే.. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విమానాల్లో తిరుగుతున్నారని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహన్‌రెడ్డి విమ‌ర్శించారు. భారీ వ‌ర్షాల‌కు ప‌త్తి, మిర‌ప పంటల‌కు తీవ్ర‌న‌ష్టం వాటిల్లిందని అన్నారు. గుంటూరు జిల్లాలోని దాచేప‌ల్లిలో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆయ‌న పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 2 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంటలు దెబ్బ‌తిన్నాయన్నారు. గ‌తేడాది ఇవ్వాల్సిన‌ ఇన్‌పుట్ స‌బ్సిడీ కూడా ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ ఇవ్వ‌లేదని ఆయ‌న అన్నారు. పంటన‌ష్టానికి రైతుల‌కు మొత్తం వెయ్యి కోట్ల రూపాయ‌లు ఇవ్వాల్సి ఉంద‌ని, అందులో 120 కోట్లు గుంటూరు జిల్లాకే రావాలని జ‌గ‌న్ పేర్కొన్నారు. రుణాలు మాఫీ కాకుండా, కొత్త‌రుణాలు కూడా పొందలేక రైతులు అనేక‌ ఇబ్బందులు ప‌డుతున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. 


కావాల్సినంత వర్షం కురిసింది: సీఎం కేసీఆర్


కరీంనగర్: 
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కావాల్సినంతగా కురిశాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో కరువు అనేదే ఉండదన్నారు. ప్రజలు వానలను చూసి చాలా సంతోషిస్తున్నారన్నారు. కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజాం సాగర్ నుంచి 90 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉందని తెలిపారు. మిడ్ మానేరుకు వరద వల్ల కట్ట తెగి నీళ్లు ప్రవహించాయని తెలిపారు.


విడిపోతే సుఖమని ఇద్దరికీ అర్థమవుతోంది: వెంకయ్యనాయుడు


హైద‌రాబాద్:
తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కలిసి కలహించుకోవడం కన్నా, విడిపోయి సహకరించుకోవడం మిన్న అని నేనెప్పుడూ చెబుతాను. ఇంతకు ముందేమో, కలిసి ఉంటే కలదు సుఖమని పాతరోజుల్లో చెప్పేవాళ్లు. ఇప్పుడేమో, విడిపోతే సుఖమని ఇద్దరికీ అర్థమవుతోంది. ఆ దిశలోనే ఇది నిజమని రుజువు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా ఉంది’ అని ఆయన అన్నారు. పాత రోజుల్లోనేమో కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పే వాళ్లు, ఇప్పుడేమో విడిపోతే సుఖమని రెండు తెలుగు రాష్ట్రాలకు అర్థమవుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా, మానసికంగా మనందరం ఒకటే. ఎందుకంటే, మనందరమూ తెలుగు వాళ్లమే. ఇక్కడ పుట్టాము.. ఇక్కడ పెరిగాము.. ఇక్కడ తిరిగాము. రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉండాలి. అని అన్నారు.


పీఎస్‌ఎల్వీ సీ-35 ప్రయోగం స‌క్సెస్


శ్రీహరికోట: 
ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయి. పీఎస్ఎల్వీ సీ-35 ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్ర్తవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్ష వాహనం పీఎస్‌ఎల్వీ-సీ35 ద్వారా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్‌లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి స్కాట్‌శాట్-1తోపాటు అమెరికా, కెనడా నుంచి ఒక్కొక్కటి, అల్జీరియాకు చెందిన మూడు, భారత యూనివర్సిటీలు రూపొందించిన రెండు ఉప్రగహాలను పీఎస్‌ఎల్వీ రెండు వేర్వేరు కక్ష్యలో ప్రవేశపెట్టింది. మొదట స్కాట్ శాట్ -1 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి వాహన నౌక ప్రవేశపెట్టింది. మొత్తం 8 ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి పీఎస్‌ఎల్వీ సీ-35 ప్రవేశపెట్టింది. రెండు గంటల 15 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలలో ఉపగ్రహాలు చేరాయి.


చంద్రబాబును కలిసిన ఇస్రో అధికారులు

విజయవాడ: 

విజయవాడలో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సీఎం చంద్రబాబును ఇస్రో అధికారులు కలిశారు. స్కాట్‌ శాట్‌ ప్రయోగం విజయవంతమైనందుకు గాను సీఎం వారికి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇస్రో అందించే డేటాను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. వర్సిటీలు, శాస్త్రసాంకేతిక సంస్థలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇస్రో అందజేసే సమాచారం వినియోగానికి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఇస్రో తరపున ప్రతినిధిని నియమించాలని సీఎం వారిని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: