' రాజీనామా ' రాజకీయ సిద్ధాంతాలలో చాలా ప్రాచుర్యం ఉన్న వ్యవహారం ఇది. రాజీనామా ని ఒక అస్త్రంగా అవసరమైన చోట బ్రహ్మాస్త్రం గా వాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు. ఏదైనా అనుకున్నది చచ్చినట్టు సాధించుకోవాల్సిన తరుణంలో రాజీనామా చేస్తాం అంటూ బెదిరిస్తారు అప్పటికీ పరిస్థితి తమ చేతులలోకి రాకపోతే చేసి తీరతారు కూడా. ప్రత్యేక హోదా గురించి ఒక్కొక్కరూ నెమ్మదిగా మరచిపోతున్న తరుణంలో సాక్షి టీవీ, జగన్ పార్టీ మాత్రం ఆ అంశాన్ని భుజాలకి ఎత్తుకుని మోస్తోంది. నిజానికి ప్రత్యేక హోదా విషయంలో జగన్ కాస్త లేటుగా స్పందించారు అనే చెప్పాలి. మొన్న ప్రవాసాంధ్రుల తో తన మాటలు పంచుకున్న జగన్ ప్రత్యేక హోదా కోసం అవసరం అయితే ఆఖరి దశలో తమ సభ్యులతో రాజీనామాలు సైతం చేయిస్తాను అని జగన్ ఖరాఖండి గా చెప్పడం విశేషం. సాక్షి ఛానల్ లో  ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్ ఈ మేరకు మాట్లాడారు.ఇందులో అడిగిన అనేక ప్రశ్నలలో ఇది కూడా ఒకటి అన్నమాట. మాటల్లో చెప్పారు తప్ప రాజీనామాల ప్రస్తావన జగన్, ఆయన పార్టీ సీరియస్ గా ఏమీ తీసుకోవడం లేదు. రాజీనామాలతో పనులు అవుతాయి అనే మాటకి కాలం చెల్లిపోయినట్టుగా ఉంది.

కాకినాడ సభలో కూడా తెలంగాణా పోరాటాన్ని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ ' రాజీనామా' ల గురించి మాట్లాడారు. అప్పట్లో తెలంగాణా కోసం కెసిఆర్ లాంటి ఎందరో రాజీనామాలు చేసారు అనీ ఆ మాత్రం బుర్ర , తెగువ మనవాళ్ళకి ఎందుకు లేదు అనీ ప్రశ్నించారు ఆయన. ప్రత్యేక రాష్ట్రం కోసం టిఆర్‌ఎస్‌ వారు వారు రాజీనామాలు చేసినట్టే ప్రత్యేక హౌదాకోసం ఎపిలో రాజీనామాలు చేయాలన్నది ఒక వాదన. ఆ ప్రశ్న కి తెలుగుదేశం సమాధానం కూడా చెప్పకపోగా జగన్ తుది దశలో మాత్రమే ఆలోచిస్తాను అంటున్నారు. ఆయన తుది దశ అనడానికి కూడా కారణం లేకపోలేదు. ముందే రాజీనామాలు చేసుకుని కూర్చుంటే సభలో కనీసం ప్రజల తరఫున మాట్లాడి తమ గొంతుని వినిపించే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు జగన్.

అదీ నిజమే మరి, ప్రతిపక్షం లేకపోతే పాలకపక్షం రెచ్చిపోతుంది కూడా. సమైఖ్యాంద్ర ఉద్యమ నేపధ్యం లో ఈ రాజీనామాల తంతు కొనసాగింది. మొదటి సారి తెలంగాణా గురించి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చిన తరుణం లో సీమాంధ్ర ఎంపీలూ, ఎమ్మెల్యే లూ రాజీనామా చేసి పడేసారు. ఇది డిల్లీ పాలకులని కదిలించింది. ఆ తరవాత కెసిఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిరాహార దీక్షలూ అదీ ఇదీ అని హడావిడి చేసిన తరవాత మాత్రమే తెలంగాణా కి మంచి జరిగింది. అప్పుడు రాజీనామా అస్త్రాన్ని వాడిన నాయకులు ఇప్పుడు అదే అస్త్రం వాడడానికి సంకోచిస్తున్నారు. టీడీపీ గానీ వైకాపా గానీ బీజేపీ గానీ తమ పోస్ట్ లకి శలవు ప్రకటించాలి అంటే పట్టుకున్న పదవిని వీడడానికి ఇష్టపడడం లేదు అలాగే రాజీనామాల వల్ల ఒరిగేది ఏమీ లేదు అంటూ వంకలు చెబుతున్నారు. తెలంగాణా సాధన అప్పుడు పరిస్థితి చాలా ప్రత్యేకం అనీ అది ఇప్పుడు వర్క్ అవ్వదు అనేది వారి ఆరోపణ.

అలాగే అప్పటి తెరాస పరిస్థితి ఇప్పుడు వైకపా పరిస్థితి ఒక్కటే కాదు కదా. కేంద్రం తెలంగాణా కి అప్పుడు ఖచ్చితంగా సానుకూలంగా ఉంది, కనీసం తమ ఎన్నికల నేపధ్యంలో అయినా సరే తెలంగాణా ఇచ్చేసి ఓటు బ్యాంకు లాక్కుందాం అని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా పట్ల కాస్త కూడా సానుకూలంగా లేదు. పైగా ప్యాకేజీ ఇచ్చాం కదా పండగ చేసుకోకుండా ఏంటి మీ గొడవ అన్నట్టు ఉంది ఈ తరుణం లో రాజీనామాలు ఏమేరకు ఉపయోగపడతాయి అనేది చెప్పలేం. జగన్‌ వ్యూహాత్మకంగా చివరి ఆరునెలల వ్యవధిలో అలాటి నిర్ణయం తీసుకోవచ్చు. ఈలోగా సవాలు విసిరిన పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా రంగంలోకి వస్తారా లేక సినిమాల్లో మునిగివుంటారా అన్నది కూడా చూడవలసిందే. ఇప్పటికి ఇప్పుడు మాత్రం రాజీనామాల వలన కొంచెం కూడా ఉపయోగం లేదు అనే వాదన వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: