500 వ ప్రతిష్టాత్మక టెస్టు ని భారత్ గెలిచేసింది. ఊహించని పరిణామాలు పెద్దగా ఎదురు అవ్వలేదు, మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ విషయంలో తడబడినా బౌలర్ ల సామర్ధ్యం ముఖ్యంగా స్పిన్నర్ లు న్యూజిలాండ్ ని ముప్పు తిప్పలు పెట్టడం చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లో మంచి పరుగులే చేసిన మన బ్యాట్స్ మెన్ నిలకడ లేని సగటు అభిమానిని ఆలోచనలో పడేసింది. లోకల్ పిచ్ ల మీదనే మనోళ్ళు ఇలా ఆడితే అబ్రాడ్ లో ఏంటి పరిస్థితి అన్నారు అందరూ. అయితే బ్యాట్స్ మెన్ కి స్పిన్నర్ లు కొమ్ము కాచారు. జడేజా - అశ్విన్ ల ద్వయం కివీస్ కి చెమటలు పట్టించి పూర్తి ఆధిపత్యాన్ని భారత్ ఖాతాలో వేసింది. పైగా సెకండ్ ఇన్నింగ్స్ లో మనోళ్ళు ఆడిన ఆటతీరు కూడా చక్కగా సాగింది.

సో రెండు ఇన్నింగ్స్ పూర్తి అయ్యే సరికి బ్యాటింగ్ - బౌలింగ్ లలో కూడా భారత్ దే పైచెయ్యి గా మారడం మనం చూసాం. 400 పైబడిన టార్గెట్ ని కివీస్ చేతిలో పెట్టి మానసికంగా వారిని దెబ్బతీసాడు విరాట్ కోహ్లీ. కపిల్ దేవ్ కాలాన్ని కాసేపు పక్కన పెడితే సౌరవ్ గంగూలీ కాలం నుంచీ లెక్కలు వేస్తే అసలైన టీం వర్క్ ఎలా సాగుతుంది అనేది విరాట్ కోహ్లీ చూపిస్తున్నాడు. ఈ మధ్య కాలం లో విజయవంతమైన కెప్టెన్ గా నిలిచినా ధోనీ, గంగూలీ లలోని మేటి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న కోహ్లీ వారికంటే మెరుగ్గా టీం వర్క్ విషయంలో మార్కులు కొట్టేస్తున్నాడు. వారిద్దరితో పోల్చిన ప్రతీ సారీ విరాట్ అత్యున్నత స్థాయి లో ముందు ఉంటాడు అది కేవలం తన ఆట విషయంలోనే కాకుండా కెప్తెన్సీ లో కూడా సాధిస్తున్నాడు ఈ కుర్రాడు. యువ ఆటగాళ్ళను ప్రోత్సహించడంలో సౌరవ్ గంగూలీ తర్వాతే ఎవరైనా అని అనిపించుకున్నాడు దాదా. ఆ నైపుణ్యంతోనే టీం ఇండియాకు అద్వితీయమైన విజయాలను అందించాడు.

దాంతో పాటుగా పోరాట స్ఫూర్తి నీ , పోరాడే తత్వాన్నీ టీం ఇండియా కి అలవాటు చేసాడు బెంగాల్ టైగర్. టీం సెలెక్షన్ విషయం లో వ్యక్తిగత ఆలోచనల కీ, ఎమోషన్స్ కీ , పర్సనల్ రిలేషన్ లకీ, తన దగ్గర వారి గురించి ఆలోచించడం లాంటివి చెయ్యడం గంగూలీకి బాగా అలవాటు. అందుకే అప్పట్లో లక్షణ్ ని కూడా వరల్డ్ కప్ లో ఆడనివ్వలేదు గంగూలీ. ఆ ఎఫ్ఫెక్ట్ ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ లో ఓడిపోవడం లాంటి సంఘటనలతో బయటపడింది. లక్ష్మణ్ ఉంటే వరల్డ్ కప్ వచ్చి తీరేది అని అందరూ అన్నారు అప్పట్ల్ మరి. అది నిజమో కాదో పక్కన పెడితే ఆస్ట్రేలియా తో వ్యూహాత్మకంగా మాత్రం ఆడేవాడు అని చెప్పచ్చు. మానసికంగా ఆస్ట్రేలియన్స్‌పైన లక్ష్మణ్‌ది ఎప్పుడూ పైచేయే కదా. ఇక ధోనీ గురించి సెలెక్షన్ విషయంలో చాలా వాదనలు ఉన్నాయి. స్వార్ధం గా సెలక్షన్ లో తనకి కావాల్సిన వారిని దక్కించుకోవడం కోసం చాలా పాలిటిక్స్ ప్లే చేస్తాడు అనేది హై లైట్ అయిన విషయం. దిగ్గజ క్రికెటర్ లు ముగ్గురునీ క్రికెట్ కి దూరం చేసిన ఘనత కూడా అతనిదే అన్నారు కూడా. పైగా టీం సెలెక్షన్ విషయంలో కూడా పర్సనల్ రిలేషన్ లతో పాటు బిజినెస్ వ్యవహారాలకి కూడా ప్రాధాన్యత ఇస్తాడు అనేవారు. ధోనీ ఎన్నాళ్ళు కెప్టెన్ గా ఉన్నడో అన్నేళ్ళూ సురేష్ రైనా టీం తోనే ఉన్నాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

తనకు బాగా ఇష్టులైన వాళ్ళను మాత్రం సంవత్సరంపాటు అన్ని మ్యాచ్‌లలోనూ ఫెయిల్ అయినప్పటికీ అవకాశాలిచ్చాడన్నది కూడా నిజం. అది ధోనీ మనస్తత్వం, ఇప్పుడు విరాట్ గురించి చూస్తే - ఇలాంటి ఆలోచన సరళి విరాట్ సొంతం కానే కాదు. ఆస్ట్రేలియా టూర్ నుంచీ కనిపెట్టుకుంటే న్యూజిలాంట్ మొదటి టెస్ట్ సెలక్షన్ వరకూ కూడా మనోడు ఎక్కడా రాజీ పడలేదు, పాలిటిక్స్ ప్లే చెయ్యలేదు. విపరీతమైన టాలెంట్ ఉన్నవారికి మాత్రమె ఫైనల్ ప్లేస్ లో స్థానం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ప్రూవ్ చేసుకోవాలి అని తపిస్తున్న ఆటగాళ్లకి కోహ్లీ వెల్లువలా అవకాశాలు ఇస్తున్నాడు. అశ్విన్ తనని తాని బ్యాటింగ్ లో కూడా నిరూపించుకోవాలి అని కోరుకుంటున్న తరుణం లో అతన్ని టాప్ ఆర్డర్ లో పంపడం పెద్ద విశేషం. అది భారత్ కి కూడా కలిసి రావడం పెద్ద విశేషమే. ఇప్పుడు న్యూజిలాండ్‌పై సాధించిన ఘన విజయానికి కూడా అదే కారణమైంది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే బౌలింగ్‌లో కూడా అద్వితీయంగా రాణిస్తున్నాడు అశ్విన్.

ఏ ఫీల్డ్ లో అయినా ప్రతిభ కి గీటురాయి అవకాశం , అది ఒక్కసారి దక్కితే చాలు తమని తాము నిరూపించుకునే వారు ఉండనే ఉన్నారు. అయితే అవకాశం ఇచ్చే చోట్ల ఎలాంటి రాజకీయ సిద్దాంతాలూ, స్వార్ధం ఉండకుండా ఉండాలి అనేది ముఖ్యమైన విషయం. మన అదృష్ట వశాత్తూ ఇప్పుడు ఆ స్థానం లో ధోనీ, గంగూలీ కంటే మెరుగ్గా విరాట్ కోహ్లీ రాణిస్తున్నాడు అని చెప్పాలి. పైగా గెలుపు తరవాత నాయకత్వ విషయంలో భేషిజాలు లేకుండా గెలవడానికి కారణమయినవారు అందరికీ ఫుల్ సపోర్ట్ ఇస్తాడు కోహ్లీ వారిగురించి పాజిటివ్ గా ఓపెన్ గా మాట్లాడతాడు. ప్లేయర్స్ కి పెద్దన్న లాగా కాకుండా వారితో కలిసిపోయే మనస్తత్వం మనోడిది. ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల క్రికెట్ టీం వర్క్ మనకి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. అది కోహ్లీ వల్లనే సాధ్యం అయ్యింది అని చెప్పాలి. ఇదే యాటిట్యూడ్ తో స్వార్ధం, వ్యాపార దృక్పదం లేని కెప్టెన్ గా విరాట్ సాగాలని ఆశిద్దాం. కోహ్లీ గ్యారేజ్ మరిన్ని కొత్త కుర్రాళ్ళతో కళకళలాడుతూ మరిన్ని భారీ రిపైర్ లు చెయ్యాలని కోరుకుందాం


మరింత సమాచారం తెలుసుకోండి: