కర్ణాటక-తమిళనాడుల మధ్య అగ్గి రాజేసిన కావేరి జలాల ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయని కర్ణాటక నీళ్లు వదిలేది లేదని స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా ఏకంగా అసెంబ్లీలోనే ఓ తీర్మాణాన్ని ఆమోదించింది. తమ రాష్ట్రానికి నష్టం కలిగుతుందని గగ్గోలు పెడుతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 


ఈ జల వివాదానికి సంబందించి తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందేనని సుప్రీం తీర్పు ఇచ్చిన అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ రచ్చకు దిగారు జనాలు. బస్సులు, షాపులు తగలబెట్టారు. ఈ అల్లర్లలో ఇద్దరు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. కర్నాటకలో చెలరేగిన అల్లర్లతో బెంగళూరులోని ఐటీ పరిశ్రమ, ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయాలపై మరోసారి కర్ణాటక ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా... తమిళనాడుకు నీరు విడుదల చేయాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది.


సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ.. మంగళవారం నుంచి రోజుకు 6 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు నీరు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. గతంలోని తీర్పును అనుసరించి తమ ఆదేశాలను పాటించని కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో కావేరి నీళ్లు తమిళనాడుకు ఇవ్వడం కుదరదని కర్ణాటక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని.. డిసెంబర్ తర్వాతే తమిళనాడుకు నీళ్లు ఇస్తామని.. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి సవరణ చేయాలని.. కర్ణాటక చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మరోసారి అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన రెండు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. 


సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మరి ఇప్పటికైనా కర్ణాటక కావేరి జలాలను వదులుతుందా..? లేదా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: