నడి సంద్రంలో నౌక ఆగిపోయింది.  విశాఖ నుండి అండమాన్ వెళ్తున్న ఎంవీ నౌక సముద్రంలో నిలిచిపోయింది. మంగళవారం రాత్రి నుండి నౌక రిపేర్ కాకపోవడంతో.. అందులో ప్రయాణిస్తున్న వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. నడి సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బాధితులు, వారి బంధువుల్లోనూ భయం నెలకొంది.


ఎంవీ హర్షవర్దన్ నౌక మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖపట్నం నుండి అండమాన్ కు బయల్దేరింది. నౌకలో 630మంది ప్రయాణికులున్నారు. వారిలో 150మంది మహిళలు కాగా.. 12మంది చిన్నారులు ఉన్నారు. విశాఖ నుండి బయలుదేరిన నౌక..70 గంటలు ప్రయాణించాల్సి ఉండగా కేవలం.. ఆరుగంటలు ప్రయాణించిన తరువాత సాంకేతిక లోపానికి గురైంది. నౌకలో మొత్తం నాలుగు జనరేటర్లు ఉన్నాయి. ప్రయాణానికి ముందే అందులో ఒక జనరేటర్ పాడైంది. అయితే.. ప్రయాణ సమయంలో దానిని రిపేరు చేయవచ్చనే ధైర్యంతో సిబ్బంది నౌకను ముందుకు నడిపించారు. 6 గంటల ప్రయాణం తరువాత మరో జనరేటర్ లోసాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. కేప్టేన్.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించగా.. వారు నౌకను నిలిపివేయాలని ఆదేశించారు. అధికారుల సూచనల మేరకు చెడిపోయిన రెండు జనరేటర్లలో ఒక దానిని నౌకా సిబ్బంది సరి చేశారు. 


కేప్టెన్ సమాచారం మేరకు వైజాగ్ నుంచి ఓ బృందం నౌక ఉన్న ప్రాంతానికి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నౌకలోని మూడు జనరేట్లు పనిచేస్తుండగా.. నాలుగో దానిని రిపేర్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి బాగవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. నౌకలో సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించినా.. ప్రయాణానికి అనుమతించిన షిప్పింగ్ కార్పోరేషన్ తీరును పలువురు తప్పుపడుతున్నారు. నడి సముద్రంలో సాంకేతిక లోపం పెద్దదై.. నౌకలో ఉన్న వారికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: