ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం  చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత జగన్‌ చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని జగన్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్‌ నోట వస్తున్న మాటలు అధికార పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. దీంతో రక్షణాత్మక దోరణిలో పడింది ఏపీ ప్రభుత్వం. అధినేతపై జగన్‌ చేస్తున్న మాటలదాడిని తిప్పికొట్టలేక, ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు తెలుగు తమ్ముళ్లు.


సాధారణంగా వైఎస్సార్‌ సీపీ అధినేత ఏం మాట్లాడిన దాన్ని సాగదీసి మాట్లాడుతుంటారు. దీంతో ఆయన చెప్పే విషయాలపై జనాలు అంతగా శ్రద్ధ పెట్టరు. కానీ ఇప్పుడు ఆయన మాటలు సూటిగా సుత్తి లేకుండా ఉంటున్నాయి. ప్రసంగాల్లో సాగదీత కనిపించడం లేదు. దీంతో జగన్ మాటలు వినేందుకు ప్రజలు కూడా బాగానే ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. తాజాగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన మాటలో కరుకుదనం, సూటిదనం కనిపిస్తోంది.


ప్రభుత్వం ఏదో  చేస్తున్నామంటూ ఆడంబరాలకు పోతుండటం తప్పా చేసిందేమీ లేదంటే బాబు పాలనపై నిప్పులు చెరుగుతున్నారు జగన్‌. తాజాగా కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైసీపీ అధినేత.. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. బాబు సర్కారు తప్పుల్ని ఎత్తిచూపుతూ నిప్పులు చిమ్ముతున్నారు. వాస్తవాల్ని ప్రస్తావిస్తూ.. బాబు పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్న వైనం అందరినీ ఆకట్టుకుంటోంది.

బుద్దున్నోడు ఎవడైనా రైతులకు తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు చెబుతాడు. కానీ.. రైతులకు రుణాలు ఇవ్వొద్దని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. వ్యవసాయ పెట్టుబడుల కోసం భార్యల తాళిబొట్లను తాకట్టు పెట్టాల్సిన దీన స్థితి రైతులది. కానీ.. వారి కష్టాలు పట్టించుకోకుండా.. బంగారం కుదవపెట్టుకొని రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే’’ అంటూ తనదైన శైలిలో వ్యంగంగా సెటైర్లు వేస్తున్నాడు జగన్‌.


వర్షాల కారణంగా  గ్రామాలు నీళ్లలో మునిగిపోతున్నా.. గ్రామాల్లోకి రాకుండా.. హెలికాఫ్టర్లో వచ్చి వెళ్లటం బాబుకే చెల్లిందంటూ మండిపడ్డ జగన్.. ప్రభుత్వంలో ఉన్న వారు సిగ్గు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి తమ గ్రామానికి హెలికాఫ్టర్ లో వచ్చాడు కాబట్టి ఆయన్ను కలుసుకొని కష్టాలు చెప్పుకోవాలని అనుకున్న గ్రామస్తులను కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారు. ఇలాంటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా రైతులకు సాయం చేస్తారు. కానీ చంద్రబాబు ఎలాంటి సహాయమూ చేయటం లేదని దుయ్యబట్టారు. 


ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా ఉండరు. బాబు నోరు తెరిస్తే అబద్ధాలు. ఆయనకు తెలిసింది ఏమిటంటే పనయ్యాక కత్తి తీసుకొని మెత్తగా పొడవటం. పిల్లనిచ్చిన సొంత మామను పొడుస్తాడు. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కూడా పొడుస్తాడు. ఇలాంటి దారుణమైన వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు అని తీవ్రంగా మండిపడ్డారు జగన్‌.  గతకొంతకాలంగా జగన్‌ మాటతీరులో చాలా తేడా వచ్చిందని, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెబుతూ అందరిని ఆకట్టుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: