పీవోకేలో భారత్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లు చేసి అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లోని రక్షణ సంస్థలు, విశాఖలోని నేవీ, గుంటూరు జిల్లా బాపట్లలోని ఎయిర్‌ఫోర్స్‌బేస్‌ను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఇస్రోలో భద్రతను కట్టదిట్టం చేయాలని కేంద్రం సూచించింది. మెట్రోనగరాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, అనుమానితులను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. 

పాలనలో కొత్తదనం కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. రొటీన్ అడ్మిస్ట్రేషన్, కాగితాలపై లెక్కలు, ఉపన్యాసాలతో విసిగిపోయానన్నారు. విజయవాడ వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. జిల్లాల మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతర అంశాల్లో కన్విన్స్ చేసినట్లు జిల్లా ప్రగతి పై తనను కన్విన్స్ చేయవద్దని.. తనకు కావల్సింది ఫలితం మాత్రమేనని మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి చురక అంటించారు. కలెక్టర్, జిల్లా మంత్రి, ఇన్‌ఛార్జి  మంత్రి సమన్వయంతో పని చేసి  ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశా నిర్దేశం చేశారు.

పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల పట్ల అశ్రద్ధ తగదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానంపై ఆరా తీసిన ఆయన.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. మూడేళ్ల నుంచి సాకులు చెబుతూనే ఉన్నారు... ఇప్పుడు కూడా కారణాలు చెప్పి తప్పించుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రి కూడా దీనికి బాధ్యత వహించాలన్నారు సీఎం చంద్రబాబు.

రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కళా వెంకట్రావు.. వైసీపీ అధినేత జగన్‌కు సూచించారు. రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదలను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని అన్నారు.  ఏదైనా విషయంపై మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులు దానిపై అవగాహన కలిగి ఉండాలని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వూరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా... లేకున్నా విపత్తుల సమయంలో చంద్రబాబులా మరెవరూ చేయలేరని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. 
కావేరీ సీడ్స్‌ లైసెన్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. కావేరీ సీడ్స్‌కు చెందిన ‘జాదూ’ పత్తి విత్తనాల నాణ్యతా రహితంగా ఉన్నాయని గుంటూరు జిల్లా చిలకలూరిపేట, అచ్చంపేట మండలాల రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన వ్యవసాయశాఖ అధికారులు నివేదిక తయారుచేశారు. వ్యవసాయ శాఖ నివేదికలను అనుసరించి కావేరీ సీడ్స్‌ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రద్దు ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది.
అక్టోబర్ నాలుగు నుంచి తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపట్నుంచి నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు లేవని ప్రకటించింది. సెప్టెంబరు నెల మొత్తం కలిపి చూస్తే తెలంగాణలో సాధారణంకన్నా 98 శాతం అధికంగా వర్షం కురిసినట్లు తెలిపింది.
మిడ్‌ మానేరుకు గండి పడిన ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. ప్రతిపక్ష నేతలు ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మిడ్‌ మానేరు నిర్మాణం 2015లోగా పూర్తి చేయాల్సి ఉన్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మానేరు నిల్వ సామర్ధ్యం కంటే ఎక్కువ నీరు పోటెత్తడంతోనే ప్రాజెక్టుకు గండి పడిందన్నారు. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడో రోజూ అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగాయి. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, సీఎస్‌ రాజీవ్‌శర్మ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. అక్రమ కట్టడాలు కూల్చడంతో పాటు రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి సమాంతరంగా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు. రెండు రోజుల్లో నాలుగు వందల అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ఇదే వేగాన్ని కొనసాగించాలని సీఎం వారికి సూచించారు. వర్షాల కారణంగా రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనావేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే నివేదిక అందించాలని ఆదేశించారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేవాలయాలపై ఉన్న శ్రద్ధ పేదల ఇళ్లపై లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఆలయాల నిర్మాణాలకు ప్రణాళికలు చేస్తున్నట్లుగానే... హైదరాబాద్‌ నగరంలోని పేదల ఇళ్ల నిర్మాణాల కోసం ఎందుకు ప్రణాళికలు చేయడంలేదని ప్రశ్నించారు. నాలాల ఆక్రమణల కూల్చివేతల్లో ప్రభుత్వం అందరినీ ఒకేలా చూడాలన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, అయ్యప్ప సొసైటీల్లో కూల్చివేతలు అర్ధాంతరంగా నిలిపివేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టంపై కంటే కొత్త జిల్లాలపైనే కేసీఆర్‌ ఎక్కువ దృష్టి సారిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో విమోచన దినం పేరుతో రాజకీయాలు మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. వరదలు వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కేంద్రసాయం కోరుతూ మాట్లాడటం సరికాదని టిఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. భారీవర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం అందించే సహాయం రెండు రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌ నగరమంతా వరదలమయం అన్నట్లుగా నగర బ్యాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని కవిత ఆరోపించారు. నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కేవలం ఐదు సర్కిళ్లలోనే వరదనీరు చేరిందన్నారు. రాష్ట్రంలో రహదారులు దెబ్బతినడం వల్ల సుమారు రూ.100కోట్ల నష్టం జరిగిందని.. వాటి మరమ్మతుల కోసం సీఎం రూ.30కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 
ఓటుకు నోటు కేసుపై గురువారం తెలంగాణ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఉదయసింహ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో సెబాస్టియన్‌ విచారణకు హాజరు కాలేదు. ఓటుకు నోటు కేసు విచారణను న్యాయమూర్తి అక్టోబరు 24కు వాయిదా వేశారు.

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పవన్‌ కల్యాణ్‌ను కలవాలంటూ హైదరాబాద్‌ కొండాపూర్‌కు చెందిన మిరియాల జ్యోతి.. జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో ఉన్న పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. పవన్‌ కల్యాణ్‌ ఇంట్లో లేరని, నెలరోజుల వరకూ రారని కార్యాలయ భద్రతా సిబ్బంది చెప్పినా ఆమె పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయారు. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పవన్‌ కార్యాలయ సిబ్బంది జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచార మందించారు. అక్కడికి చేరుకున్న మహిళా కానిస్టేబుల్‌ స్వప్నపై మిరియాల జ్యోతి దురుసుగా ప్రవర్తించి.. విధులను ఆటంక పరిచారు. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. గతంలోనూ ఆమె సినీనటుడు మహేశ్‌బాబు ఇంటి ముందు, మరో ప్రైవేటు కార్యాలయం ఎదుట ఇలాగే ఆందోళన చేసినట్లు పోలీసులు గుర్తించారు.

తెలంగాణలో ఎస్సై నియామకాలకు తుది రాత పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. సివిల్‌ అభ్యర్థులకు నవంబర్‌ 19,20 తేదీల్లో, పీటీవో కమ్యూనికేషన్‌ ఎస్సై అభ్యర్థులకు నవంబర్‌ 19, 20, 27 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు వారం రోజులు ముందు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: