భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ.. సర్వత్రా రెండు దేశాల శక్తి సామర్ధ్యాల లెక్కింపు జరుగుతోంది. యుద్ధం జరిగితే.. భారత్ దే పై చేయని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో చెబుతుంది. కానీ.. పాకిస్థాన్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. సైనిక బలగంలో కాని, ఆయుధ సామర్ధ్యంలో కాని భారత్ తో సరితూగని పాకిస్థాన్.. కయ్యానికి కాలుదువ్వుతోంది. యుద్ధం జరిగితే భారత్ కు తగిన జవాబిస్తామని హెచ్చరిస్తోంది. తమ దగ్గరున్న అణ్వాయులేమీ.. ఆడుకునే బొమ్మలు కావని, అవి తమపై దాడి చేసే శత్రు దేశాల కోసం తయారు చేసుకున్నవంటూ బెదిరింపులకు దిగుతోంది. శక్తి సామర్ధ్యాలలో భారత్ తో ఏమాత్రం సరితూగని పాకిస్థాన్ కు అంత ధైర్యం ఎక్కడిది..? ఎవరిని చూసుకుని దాయాది దేశం రెచ్చిపోతుంది?


ఇన్నాళ్లూ పాకిస్థాన్ ను వెనకేసుకొచ్చిన అమెరికా ప్రస్తుతం.. ఆ దేశ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది. భారత్ కు స్నేహ హస్తానందిస్తోంది. అయినా పాకిస్థాన్ ఎవరిని చూసుకుని యుద్ధానికి కాలు దువ్వుతోంది. అంటే.. అమెరికా సహా అన్ని దేశాలు చైనా వైపే వేలు చూపిస్తున్నాయి.  భారత్, పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నవేళ తొలుత పాకిస్థాన్ కు తమ అండా, దండా ఉంటాయని ప్రకటించిన డ్రాగన్, తరువాత రెండు దేశాలు సంయమనం పాటించాలని సూక్తులు వల్లించింది. కానీ పాకిస్థాన్ ను వెనకుండి.. భారత్ పైకి పంపుతోంది. ఈ రెండు దేశాల మధ్య పెద్దఎత్తున సాగుతున్న ఆయుధ వ్యాపారమే ఇందుకు నిదర్శనం. చైనా దన్ను కారణంగానే పాక్ .. మనపైకి కొమ్ములు విసురుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  


ఆసియా దేశాల అభివృద్ధిలో భారత్ ముందంజలో ఉండటాన్ని చైనా ఓర్వలేకపోతుంది. అన్ని రంగాల్లో భారత్ నుండి వస్తున్న పోటీని చూసి కంగారుపడుతోంది. భారత్ ను దెబ్బతీసేందుకు దాయాది దేశమైన పాకిస్థాన్ కు స్నేహ హస్తమందిస్తోంది. యావత్ ప్రపంచం పాకిస్థాన్ కు ఉగ్రవాద దేశంగా చూస్తుంటే.. చైనా మాత్రం.. ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఐదేళ్ల క్రితం వరకు పాకిస్థాన్ కు అమెరికా, చైనా దేశాల నుండి సమాన స్థాయిలో ఆయుధాల దిగుమతి జరిగేది. కొంత కాలంగా అమెరికా నుండి ఆయుధ సరఫరా తగ్గిపోగా.. చైనా నుండి మాత్రం రెట్టింపు స్థాయిలో జరుగుతోంది.


ఉగ్రవాద దేశంగా పేరొందిన పాకిస్థాన్ కు చైనా ఎందుకు సపోర్ట్ చేస్తోంది. అంటే అందరి నుండి వ్యక్తమయ్యే మాట ఒక్కటే భారత్ ను దెబ్బతీయడమే చైనా లక్ష్యమని. అంతర్జాతీయ వాణిజ్యం, ఆసియా దేశాల్లో పట్టు సహా ఇతర అంశాల్లో చైనా మన పట్ల ఈర్ష్య పెంచుకోవడానికి కారణమయ్యాయమంటున్నారు. అమెరికా, భారత్ మధ్య స్నేహం పెరగడంతో.. పాకిస్థాన్ కు చైనా అభయహస్తమందిస్తోందని విశ్లేషిస్తునారు. 


చైనా నుంచి పాకిస్థాన్ కు ఆయుధాల సరఫరా అయిన తీరును గమనిస్తే.. ప్రతీ ఒక్కరూ అవాక్కవ్వాల్సిందే. అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంలో చైనా మూడోస్థానంలో కొనసాగుతోంది. చైనా కున్న కస్టమర్లలో ప్రథమ స్థానంలో ఉన్నది పాకిస్థానే. 2011 నుండి 2015 వరకు 840కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, రక్షణ సామాగ్రిని పాకిస్థాన్ కొనుగోలు చేసింది. చైనాతోకలిసి సుమారు 300జేఎఫ్-17 రకం యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం పాక్‌ వద్ద ఆరు సబ్ మెరైన్స్ ఉండగా.. 2016 జులైలో మరో ఎనిమిదింటిని సరఫరా చేసేందుకు చైనాతో పాక్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం భారత అంబుల పొదిలో 14 జలాంతర్గతాములు ఉన్నాయి. పాకిస్థాన్ కు చైనా నుండి 8 సబ్ మెరైన్స్ అందే సమయానికి భారత్ సబ్ మెరైన్స్ సంఖ్య 40కి చేరే అవకాశముంది. 


ఇవే కాక చైనా నుండి..  2500 టన్నుల సామర్థ్యమున్న 4 జుల్ఫికర్‌ శ్రేణి రక్షణ నౌకలు పాక్ చేతికి చేరనున్నాయి. వీటిలో 3 చైనాలో తయారవుతుండగా ఒకటి కరాచీలో తయారవుతోంది. యుద్ధనౌకలను ధ్వంసం చేసే క్షిపణులను ప్రయోగించగలిగే అజ్మత్‌ శ్రేణికి చెందిన 4 యుద్ధబోట్లను చైనా రూపొందిస్తోంది. చైనాకు చెందిన 90-రకం యుద్ధట్యాంకుల వంటివే ఆల్‌ ఖలీద్‌ పేరుతో పాక్‌ 600 ట్యాంకర్లను సమకూర్చుకుంది. పాకిస్థాన్ లోని చస్మాలో చైనా రెండు అణు రియాక్టర్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. అణుబాంబుల తయారీ పరిజ్ఞానం యురేనియం కూడా చైనా.. పాకిస్థాన్ కు సరఫరా చేసినట్లు అగ్రరాజ్యం అమెరికా అనుమానిస్తోంది.  చైనా అండ లేకుండా పాకిస్థాన్ ఇంత దుస్సాహసానికి ఒడిగట్టదని భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: