త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లితకు ఏమైంది? నిజానికి జ‌య హెల్త్ ఊహించ‌నంత‌ క్రిటిక‌ల్‌గా ఉందా? డాక్ట‌ర్లు ఎందుకు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేయ‌డం లేదు? అస‌లు ఏం జ‌రుగుతోందంటూ జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  


గత పది రోజుల క్రితం ఆనారోగ్యం కారణంగా చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే మూడు రోజులు నుంచి ఆమె ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులిటెన్‌లు కూడా విడుదల చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే స‌మ‌యంలో అమ్మ‌ ఆరోగ్య పరిస్థితుల మీద జరుగుతున్న వదంతుల ప్రచారం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఓవైపు జయలలిత ఫోటోలు విడుదల చేయాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది అనవసర గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 


జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తమిళనాడుకు చెందిన రీగన్ ఎస్ బెల్ అనే సుప్రీం కోర్టు న్యాయవాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మూడు పేజీలే లేఖ రాశారు. అసలు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? సీఎం హెల్త్ గురించి అంత రహస్యం ఎందుకు పాటిస్తున్నారో తెలుసుకోవాలంటూ ఆయన ఆ లేఖలో రాశాడు. సీఎం ఆరోగ్యం గురించి ఎవరూ ఏమీ బయటకు చెప్పడం లేదని అందులో ఆవేద‌న‌వ్య‌క్తం చేశాడు. ఆసుపత్రి వద్ద వెయ్యి మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ఆగిపోయిందని, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ఆమె ఆరోగ్యం గురించి ఏమీ తెలియదని ఆయన వాపోయాడు. ముఖ్యమంత్రిని చూసేందుకు గవర్నర్‌ను కూడా అనుమతించడం లేదన్నారు. జయ ఆరోగ్యంపై అపోలో వైద్యులు నోరు ఎందుకు మెదపడం లేదని తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని, ముఖ్యమంత్రి ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించే పరిస్థితిలో ఉన్నారో లేదో చెప్పాలని అన్నారు. 


మ‌రోవైపు అమ్మకి ఏమైందో చెప్పాలంటూ ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జయ ఆరోగ్యంపై ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక సోషల్ మీడియాలో జయలలిత ఆరోగ్యంపై పుకార్లు ప్రచారం చేస్తున్నారంటూ ఒక ఎన్నారైతో పాటు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రచారాలతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. అమ్మ ఆరోగ్యంపై అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.  
 
జయ రిపోర్టులు బయటకు రావడంపై అపోలో ఆసుపత్రి వైద్యులు ఇద్దరు నర్సులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. శనివారం జయలలితను పరీక్షించేందుకు గాను విదేశీ వైద్యులు చెన్నైకి చేరుకున్నారు. లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు రిచర్డ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
మ‌రోవైపు, తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు జయలలిత ఆరోగ్యంపై స్పందించకపోవడంపై డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అమ్మకు సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు అపోలో వైద్యులతో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. అన్నాడీఎంకే పార్టీకి చెందిన స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలకు అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు. అమ్మ‌ ఆరోగ్యం విషమించిందంటూ దుష్ప్రచారం జరుగుతోంద‌ని దీనిపై స్పందించిన ఏఐడీఎంకే నేతలు పుకార్లను నమ్మవద్దని ప్రకటన చేశారు. ప్రస్తుతం జయలలిత చికిత్స పొందుతోన్న అపోలో ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: