బార్డ‌ర్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ వేడెక్కుతోంది. ఇండియా-పాకిస్తాన్ ఘ‌ర్ష‌ణ ఇప్పుడు సినీ ఆర్టిస్టుల మ‌ధ్య కూడా చిచ్చురేపుతోంది. ఉడీ ఉగ్రదాడి నేప‌థ్యంలో బాలీవుడ్‌లో పాకిస్తాన్ ఆర్టిస్టుల‌ను బ్యాన్ చేయ‌డం, ఆ నిర్ణ‌యంపై సల్మాన్ ఖాన్ కూడా రంగంలోకి దిగ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.    


ముందుగా పాకిస్తాన్ యురి దాడి.. దానికి కౌంటర్ గా భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిమీదే చర్చ. టెన్షన్ వాతావరణం నెలకొంది. కేవలం రాజకీయ రంగంలోనేకాక సినీ, క్రీడా రంగంలోనూ ఈ చర్చ హాట్ హాట్‌గా నడుస్తోంది. 
ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నానన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఇంతటితో ఉడీకి సంబంధించి ప్రతీకారం తీరినట్లేనని వ్యాఖ్యానించారు. ఇండియాలో పాకిస్థానీ నటీనటులను బ్యాన్ చేయ‌డం సరికాదంటూ స‌ల్మాన్.. నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుపట్టాడు. 'ఉడీ సైనిక స్థావరంపై దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులేకదా, పాకిస్థానీ నటీనటులు కాదుకదా.. మరి అలాంటప్పుడు నటీనటులపై నిషేధం ఎందుకు?' అని ప్రశ్నించాడు. 'వాళ్లు ఉగ్రవాదులు కాదు. నటులు. ఇక్కడ(భార‌త్‌లో) పని చేసుకునేందుకు వీసా తీసుకొనిమరీ వచ్చారు. మన ప్రభుత్వమే వీసాలు మంజూరుచేసింది' అని వ్యాఖ్యానించిన సల్మాన్.. 'వాళ్లు నటులా? ఉగ్రవాదులా?' మీరు చెప్పండి.. అని మీడియా ప్ర‌తినిధుల‌ను ప్రశ్నించాడు. పాకిస్థానీ నటులు ఇండియాను విడిచి వెళ్లాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాక్ నటీనటులులపై నిషేధం విధిస్తున్నట్లు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని స‌ల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, దీపికా సహా పలువురు ఆర్టిస్టులు ఖండించారు. 


పాక్ ఆర్టిస్టుల‌కు స‌పోర్టుగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే నిప్పులు చెరిగారు. స‌ల్మాన్ మెదడు అప్పుడప్పుడూ ట్యూబ్‌లైట్‌లాగా పనిచేస్తుందని రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. దేశాన్ని, ప్రజలను కాపాడే క్రమంలోనే సైనికులు ప్రాణాలు విడిచారని, వారికి వ్యక్తిగతంగా పాక్‌తో ఎలాంటి వైరమూ లేదని, వారు ఎదుర్కొన్న బుల్లెట్లు సినిమాల్లో చూపించినట్టు నకిలీవి కావని అన్నారు. భారత సైనికులు చేసేవి సినిమాలో సల్మాన్‌ లా అవాస్తవ పోరాటాలు కాదని, వారంతా ఆయుధాలు పక్కనపెట్టి గులామ్‌ అలీ సంగీత కచేరీకి వస్తానంటే ఏమి చేస్తావని ఆయన సల్మాన్‌ను ప్రశ్నించారు. మొదట పాక్‌ ఆర్టిస్టుల వద్దకు వెళ్లి ఉరీ ఉగ్రదాడిని ఖండించాలని కోరామని, వారు అందుకు అంగీకరించకపోవడంతోనే 48 గంటల్లో దేశాన్ని వదిలి పోవాలని హెచ్చరించామని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ ప్రజలు చాలా మంచివారని తాను గతంలో కూడా చెప్పానని వారితో మనకెలాంటి సమస్యా లేదు గానీ అక్కణ్నుంచి ఉగ్రవాదులుగా మనముందుకు వస్తున్న వారితోనే సమస్య అని రాజ్ థాకరే అన్నారు. అయినా వందకోట్ల ప్రజలున్న ఈ దేశంలో టాలెంట్‌ ఉన్న నటులే దొరకనట్టు, పక్క దేశం వారిని ప్రోత్సహించడమేమిటని ఆయన ప్ర‌శ్నించారు.


మొత్తానికి పాకిస్తాన్‌తో భార‌త్ చేస్తున్న యుద్ధంకు మ‌ద్ద‌తుగా భార‌తీయులంతా ఒక్క‌టిగా ఉండాలి. సినీ, క్రీడారంగాల్లో ఈ యుద్ధ నీడ ప‌డ‌కూడ‌దు. విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు ఉండ‌కూడ‌దు. ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తూ భార‌త్‌కు పెను స‌వాల్‌గా మారుతున్న పాక్ కుట్ర‌ను మ‌ట్టుపెట్టేందుకు భార‌తీయులంతా ఒక్క‌టిగా ఉండాల్సిన, నిల‌బ‌డాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: