తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శరన్నవరాత్రులు

హైద‌రాబాద్: 

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం, వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయం, జూబ్లీహిల్స్‌ పెద్దమతల్లి ఆలయం, బాసర సరస్వతి అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై  దసరా ఉత్సవాలు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి.


శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం


తిరుమల:
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరుగుతోంది. ధ్వజారోహణకు ముందు రోజు సాయంకాలం శ్రీవారి సేనాధిపతులైన శ్రీవిష్వక్సేనులవారు ఆలయానికి నైరుతి వైపున ఉన్న వసంత మండపానికి వేంచేస్తారు. ఆలయ ప్రవేశం అనంతరం ఆదివారం రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ చేస్తారు. సోమవారం సాయంత్రం 6:15 గంటల నుంచి 6:30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం ఘట్టంతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను రాత్రి 8.15 గంటలకు సమర్పిస్తారు. 


 రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష


విజయవాడ: 
రాజధాని నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ, స్విస్‌ ఛాలెంజ్‌, ఎన్జీటీ కేసులపై చర్చిస్తున్నట్లు సమాచారం. నాలుగు గ్రామాల్లో ప్లాట్ల పంపిణీ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు. మరో రెండు గ్రామాల్లో ప్లాట్ల పంపిణీ చేపడుతున్నట్లు వివరించారు.


ఎమ్మెల్యే పదవికి డీకే అరుణ రాజీనామా


హైద‌రాబాద్: 
మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. త‌న‌ రాజీనామా లేఖను చదివి వినిపించారు. గద్వాలను జిల్లాగా చేయాలని ఏడాదిగా పలుమార్లు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. జిల్లా కోసం శాంతియుత ఉద్యమాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు జరిగాయని, ప్రజల ఆకాంక్షను సీఎంకు అనేక రూపాల్లో తెలిపామని వివరించారు. ప్రజల అభ్యంతరాలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారని పేర్కొన్నారు. అయితే చివరకు వాటిని పట్టించుకోలేదని అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపుతున్నానని, దానిని ఆయన స్పీక‌ర్‌కు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 


అమ‌రావ‌తి రైతులకు ప్లాట్ల పంపిణీ: మంత్రి నారాయణ


అమ‌రావ‌తి:
నవంబర్ 15 నాటికి రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ప్లాట్ల పంపిణీ పూర్తయ్యాక మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామని ఆయన మంత్రి చెప్పారు. అక్టోబరు నెలాఖరుకు రహదారుల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని నారాయణ తెలిపారు. నీటి నిర్వహణపై నెదర్లాండ్‌ కంపెనీ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోందని ఆయన వెల్లడించారు. రాజధాని పరిధిలో 6 లైన్ల రహదారుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. రాజధానికి ప్రతిపక్షాలు అడ్డుపడడం సబబు కాదని మంత్రి నారాయణ చెప్పారు.


విశాఖను సినీ హబ్‌గా మారుస్తాం: మంత్రి గంటా


విశాఖ: 
విశాఖపట్నంను సినీ హబ్‌గా మారుస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్టోబర్ 9న విశాఖలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సినీ ప్రముఖులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజేంద్రప్రసాద్‌, పూరీ జగన్నాథ్, సి.కల్యాణ్, కేఎస్ రామారావు, అశోక్‌కుమార్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: