తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఉన్న తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఉన్నారు. వారు పరామర్శించిన అనంతరం జయలలిత కేబినెట్ సహచరులంతా అపోలోకు క్యూకట్టారు. ఇప్పటికే జయలలితకు చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. 


Image result for jayalalitha

వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో అమ్మ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జయ ఆరోగ్యంపై రాజ్‌భవన్‌ నుంచి ప్రకటన లేదా ఆస్పత్రి నుంచి బులిటెన్‌ వెలువడే అవకాశముందని విశ్వసనీయంగా తెలుస్తోంది. జయలలితను పరామర్శించిన అనంతరం ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. ఆయన మరో రెండురోజులు చెన్నైలోనే ఉండనున్నారు. జయ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో చెన్నై అపోలో ఆస్పత్రికి తమిళనాడు మంత్రులు, అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు.


Image result for jayalalitha

గత వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న అమ్మ (జయలలిత) ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక వైద్యుడి పర్యవేక్షణలో చెన్నైలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు అన్నాడీఎంకే తెలిపిన సంగతి తెలిసిందే. జయలలిత తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టు వచ్చిన వదంతులను ఆ పార్టీ తోసిపుచ్చింది. జయలలిత ప్రస్తుత పరిస్థితిని తెలిపేందుకు ఫొటోలు విడుదల చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది. ‘అమ్మ కోలుకుంటున్నది. త్వరలోనే ఆమె డిశ్చార్జ్‌ అవుతారని భావిస్తున్నాం. జయలలిత ఫొటోలు విడుదల చేయాలన్న అవసరం లేదని భావిస్తున్నాం. మేం ప్రజలకు మాత్రమే జవాబుదారీ. ప్రతిపక్షాలకు కాదు’అని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పన్రుతి ఎస్‌ రామచంద్రన్‌ శనివారం విలేకరులకు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: