ఒకప్పుడు రాష్ర్టంలోని కొన్ని జిల్లాలకే పరిమితమైనా మట్కా జూదం ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని వణికిస్తోంది. పాతబస్తీలో ప్రధానంగా ఇది వేళ్లూనుకుంది. ఎందరో అభాగ్యులు ఈ మహమ్మరి బారిన పడి తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కూలీల నుండి ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు సైతం ఈ మహమ్మరికి దాసోహం అవుతున్నారు. మట్కా ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ‘కళ్యాణి’. దీనిని ‘లోకల్’ అనికూడా అంటారు. ఇందులో రూ.100 నుండి పందెం మొదలవుతుంది. నెంబరు తగిలితే రూ.200 వరకు వస్తాయి. ఇక రెండోది ‘నేషనల్’. ఇది స్థానికేతరులకు సంబంధించినది. ఇందులో రూ,100 కాస్తే ఏకంగా నాలుగు రెట్లు వస్తుంది. అంటే ఏకంగా రూ.400 సంపాదించవచ్చన్నమాట. తక్కువ మొత్తంతో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో అమాయకులు ఈ జూదానికి బానిసవుతున్నారు. చాదర్ ఘట్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీ, తలాబ్ కట్ట, భవానీనగర్, సుల్తాన్ షాహీ, డబీర్ పురా బ్రిడ్జి కింద ఉండే ఓ హోటల్ చాంద్రాయణ గుట్ట, బాబానగర్, మలక్ పేట రేస్ కోర్స్ సమీపంలోని కొన్ని ప్రాంతాలు, మిరాలంమండి, యాకుత్ పుర, మొగల్ పుర తదితర ప్రాంతాల్లో ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. ఉదయం 8:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ జూదం ఓపెనింగ్ నెంబర్ తెలిసే మధ్యాహ్నం 12:00 గంటలకు, ఆ తర్వాత క్లోసింగ్ నెంబర్ సాయంత్రం 4:00 గంటల ప్రాంతాల్లో ఈ అడ్డాలు కిక్కిరిసిపోతాయి. కాగా ఇవి సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ జూదం నగరం నుండే కాకుండా శివార్లను ఆనుకొని ఉన్న పలు జిల్లాలు, ఇతర దేశాల నుండి కూడా సాగుతుండటం గమనార్హం. నెంబరు తగిలితే హవాల మార్గాల్లో వారికి డబ్బు ముడుతుంది. ముంబాయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ మట్కా వ్యాపారం ఓ డాన్ కనుసన్నల్లో పనిచేస్తోందని తెలిసింది. ఒకప్పుడు ఆగర్ బత్తీల వ్యాపారం చేసుకునే ఈ డాన్ కోట్లకు పడగలెత్తాడని జూదంలో నష్టపోయిన బాధితులు శాపనార్దాలు పెడుతున్నారు. పోలీసులను మచ్చిక చేసుకోవడంలో అతనికి మించిన వారు లేరు. ముఖ్యంగా పాతబస్తీలోని ఓ ప్రధాన పార్టీ నేతలతో ఇతనికి కీలక సంబంధాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. వీరి మద్దతుతో డాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నగరమంతటా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కాగా గతంలో ఈ దందా రంగారెడ్డి జిల్లాలోని తాండూరు కేంద్రంగా పనిచేసేది. చోటు అనే వ్యక్తికి చెందిన ముఠా సభ్యులు దీనిని నిర్విరామంగా కొనసాగించేవారు. చోటు ఒకప్పుడు రిక్షా కార్మికుడు. ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడు. తమ బతుకులు నాశనం చేస్తున్న ఈ జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: