రాగం లేని గాణం ఆలపిస్తే ఎలావింటారు చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ లో అన్నీ పార్టీలది ఇదే పరిస్థితి.ఒక్కో పార్టీది ఒక్కో పిచ్,ఒక్కో రాగం అన్నీ కలిపి రణగొణ ధ్వనిగా మారి జనాల చెవులు బొబ్బలెక్కుతున్నాయి. తెలంగాణ కోసమే తన జీవితం అన్న తెరాస అధినేత కేసిఆర్ మళ్లీ పాత పాటే, చిలక జోస్యమే. రెండు నెలల్లో తెలంగాణ వస్తోంది అన్నారు. అందరు రివర్స్ కాగానే మౌనముద్ర లోకి వెల్లిపోయారు. కాని ఆయన కుటుంబ రాజకీయవారసులు రామారావు,హరీష్ రావులతో పాటు ఈటేల రాజేందర్ లాంటి వారు తెలంగాణలో తాము తప్ప మరెవరు అడుగే పెట్టొద్దన్నట్లు గా వ్యవహరిస్తూ నానా యాగి చేస్తున్నారు. ఇక బిజేపిది పాతపాటే, కేంధ్రంలో అధికారం మాదే, తెలంగాణ ఇచ్చేది మేమే అంటున్నారు. ఇందులో భాగమే తాజాగా ఉమాభారతి నోట తెలంగాణ మాట మరొక్కసారి గట్టిగా వినిపించారు.సిపిఐ తాజాగా నిర్వహించిన రాష్ట్రమహాసభల్లో చేసిన రెండు ప్రధానతీర్మనాల్లో మొదటిది తెలంగాణకు అనుకూలమని,దాని కోసం పోరాడాలని. అన్నింటి కంటే ప్రధానమైన మరోపార్టీ టీడీపి, ఇక దీని పరిస్థితి బాస్ పెదవి విప్పడు, తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఆవేశం ఆపుకోరు. ఇప్పుడు అదే తంతు నడిపిస్తున్నారు. ఇచ్చేది మేమే,తెచ్చేది మేమే అనే అసలైన కాంగ్రేస్ పార్టీ నేతలది తలోమాట. టీఎంపీలు ఉద్యమం ఇక ఉదృతం చేస్తామంటూ ఆల్టిమేటం జారీచేస్తుండగా, కోస్తా,ఆంధ్ర నాయకులు కొందరు ముక్కలు కానివ్వమని, రాయలసీమలో కొందరు రాయలతెలంగాణ అని మళ్లీ గాణం మొదలుపెట్టారు. సందెట్లో సడేమియాలా కొత్తగా దూసుకు వచ్చిన వైకాపా రూటే సపరేటు, ప్రత్యేకం అనకుండానే తెలంగాణ ప్రజల గుండెల్ని దోచుకోవడం మొదలుపెట్టింది. అడిగితే మాత్రం అదేరాగం ఇస్తే కాదనం,ఇవ్వాలని పోరాడే సత్తా మాకు లేదని చక్కగా తప్పించుకుంటోంది. సోలో సాంగ్ ను ఒకరు,డ్యూయట్ ను ఇద్దరు రాగం లేకున్నా, శృతిలయలు కలువకున్నా పాడితే ఇష్టంగా కాకపోయినా కష్టంగా వినవచ్చు. ఒక్క తెలం‘గాణా‘న్ని ఇన్ని పార్టీలు కలిపి ఇష్టం వచ్చినట్లుగా ఆలపిస్తే ఎవరు ఆలకిస్తారు. ఎవరు సరిగా పాడుతున్నారని గుర్తించి జై కొడుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: