హైదరాబాద్: రాష్ర్ట నాయకత్వంపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనీ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ర్టపతి ఎంపిక ప్రక్రియ ముగిసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం రాష్ర్టంపై పూర్తిగా ద్రుష్టిని మళ్లించే అవకాశం వుందనీ గత కొంత కాలంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలసిందే. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు జోరుగా ప్రచారం ఊపందుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నాయకత్వాన్ని గనుక మారిస్తే ఈ దఫా తెలంగాణ ప్రాంతానికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి అవకాశం కలిపించవచ్చని వార్తలొస్తున్నాయి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూర్చోబెట్టి కాంగ్రెస్ రెడ్లను దూరం చేసుకోవడం లేదనే మెస్సెజ్ ఇవ్వలనీ కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు...కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ పార్టీలోకి రెడ్లు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు వెళ్లిపోతున్న విషయం విధితమే. దీనితోనే కాంగ్రెస్‘రెడ్డి’సామాజిక వర్గం వైపు మొగ్గును చూపెడుతుందని సమాచారం.  కాగా, తాజాగా వస్తున్న వార్తల ఊహాగానాల ప్రకారం...జాతీయ విపత్తు నివారణ మండలి ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, రాష్ర్ట మంత్రులు జానారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డితో పాటు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహా పేర్లు ప్రముఖంగా వినపిస్తున్నాయి. ఉప ఎన్నికలను బూచిగా చూపెట్టి నాయకత్వాన్ని మార్చడానికి కూడా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా తెలంగాణ ఉద్యమం నడుస్తోంది. పదవుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనీ ఈ ప్రాంత నాయకులు మధనపడుతున్నారు. నాయకత్వాన్ని ఈ ప్రాంతానికి అప్పగించేందుకు ఉప ఎన్నికల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెం దిన వారికి పదవులు కట్టబెట్టం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయవచ్చనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. కానీ, పదవులు ఇచ్చిన మాత్రాన తెలంగాణ ఉద్యమం చల్లబడుతుందనేది కాంగ్రెస్ అధిష్టానం అమాయకత్వమేనని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులే అభిప్రాయపడుతున్నారు.  ఇదిలా ఉంటే ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ హైకమాండ్ తీరు చూస్తుంటూ ‘పుండు ఒక దగ్గర ఉంటే మందు మరో చోట పెట్టినట్లు’గా తరుచూ సీఎంలను మార్చుకుంటూ పోతుంది. పార్టీని ప్రక్షాళన చేయకుండా, ప్రజల మనోభావాల్ని పట్టించుకోకుండా నాయకత్వాన్ని మార్చుకుంటే పోవడం వల్ల పార్టీకి జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పాలి. ఇది గ్రహించకుండా పార్టీ అధిష్టానం ‘మార్పు’లకు శ్రీకారం చుట్టాలని భావించడం వల్ల పార్టీలోనూ కొంత అసంత్రుప్తి వ్యక్తమవుతోంది. 2014లో జరిగే సాధారణ ఎన్నికలకు ముందుగా జరిగిన ఈ ఉప ఎన్నికలను సెమీ ఫైనల్ ఎన్నికలుగా అందరూ భావించారు. గ్రూపులను పక్కన బెట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరథమహారథులందరూ ప్రచారం నిర్వహించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు హేమాహేమీలు ఎన్నికల ప్రచారం చేసినా ఫలితాలు ఆశించినంతగా రాలేదు. కాంగ్రెస్ బొక్కాబోర్లపడ్డది. దీని నుంచి తేరుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం మార్పుపై ద్రుష్టిని మళ్లించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి  రాష్ర్టంలో అనేక మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా నాయకత్వాన్ని మార్చినంత మాత్రాన పరిస్థితులు చక్కబడుతాయనుకోవడం అత్యాశనే అవుతుందనీ కాంగ్రెస్లోని ద్వితీయశ్రేణి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: