హైదరాబాద్: రైల్ జర్నీ చాలా సేఫ్ అనేది అందరి అభిప్రాయం. ఇప్పుడు రైల్ జర్నీ కూడా అంత సేఫ్ ఏమీ కాదనీ తేలిపోయింది. రైల్లో కూడా భద్రత లేదనీ నెల్లూరు రైలు ప్రమాదం రుజువు చేసింది. బస్ ఎక్కితే సైకోల భయం. రైల్ ఎక్కితే అగ్ని ప్రమాదాలు. మొత్తానికి ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. నెల్లూరు వద్ద నిన్న జరిగిన తమిళనాడు సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 32మంది ప్రయాణికులు చనిపోయిన విషయం విధితమే. రైలులో అగ్నిప్రమాదం సంభవించడం వల్ల ఎస్-11బోగిలో ఉన్న ప్రయాణికులు బుగ్గి బుగ్గి అయ్యారు. యావత్ రాష్ర్టాన్ని శోకసముద్రంలో ముంచెత్తిన ఈ రైలు ప్రమాదంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక సంఘ విద్రోహకులెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పుడు యావత్ దేశమంతా దీనిపై చర్చ కొనసాగుతుంది. నెల్లూరు రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముకుల్ మాత్రం విద్రోహుల చర్య అని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం, ఫోరెన్సిక్ చేరి దర్యాప్తును ముమ్మరం చేశాయి. క్షణాల్లోనే బోగికి బోగి బుగ్గిపాలు కావడం, కిరోసిన్ డబ్బాలు, రసాయన పదార్థాలు లభ్యం కావడంతో దీని వెనుక విద్రోహక చర్య ఉండి ఉండవచ్చనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. దుర్ఘటన జరిగిన తీరును బట్టి పేలుడు పదార్థాల ద్వారనే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానం అందరిలో వ్యక్తమవుతోంది. షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదనీ రైల్వే అధికారులంటున్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగినా కరంటు ప్రమాదాలను నివారించడానికి బోగీలో పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయనీ రైల్వే అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ తో కోచ్ తగలబడే స్థాయిలో నిప్పురవ్వలు ఎగబడే అవకాశం ఉండదనీ అధికారలంటున్నారు. అయితే, తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే అధికారులు ఈ సాకులంతా చెబుతున్నారే తప్ప మరొకటి కాదంటున్న వారూ లేకపోలేదు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కిరణ్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, విజయమ్మ తదితరులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రైల్వే శాఖాధికారుల నిర్లక్ష్యానికి నెల్లూరు రైలు ప్రమాదం నిలువుటద్దమంటున్నారు. కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగకపోవచ్చనీ, దీని వెనక విద్రోహులుండొచ్చనే అనుమాన్ని వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన వారు మాత్రం ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్దారణకు రాలేదు. రైల్వే అధికారులు షార్ట్ సర్క్యూట్ అని అంటుంటే సంబంధిత మంత్రి విద్రోహుల చర్య కావచ్చనీ అనుమానం వ్యక్తం చేశారు. ఒకే శాఖలో భిన్నభిప్రాయాలు వ్యక్తం కావడంతో అధికారులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశం వుంది. క్షణాల్లో బోగిలో మంటలు చెలరేగడం, మ్రతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉండటం వల్ల ఇది ముమ్మాటికీ విద్రోహక చర్య అనే అనుమానం మరింత బలపడుతోంది. మొత్తానికి రైల్వే అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వేల రూపాయలు వెచ్చించి ప్రయాణికులు టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటే కనీసం భద్రతను కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖాధికారులపై వుంది. కానీ, వారు భద్రత విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో, విద్రోహుల చర్యనో తెలియదు కానీ, మొత్తానికి క్షణాల్లో కొన్ని నిండు ప్రాణాలు కాలిబూడిదయ్యాయి. ఎన్నో కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. రోడ్డున పడేశాయి. దిక్కులేని వారిగా చేశాయి. ఇదిలా ఉంటే గత నాలుగేళ్ల కిందట గౌతమి ఎక్స్ ప్రెస్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పుడు కూడా అనేక మంది కాలిబూడిదయ్యారు. గౌతమి ఎక్స్ ప్రెస్ సంఘటన వెనుక కూడా విద్రోహుల హస్తం వుందనీ అందరూ అన్నారు. అయితే, తరువాత మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందనీ తేలింది. ఇప్పుడు కూడా విచారణ పూర్తయితే కానీ, వాస్తవం ఏమిటో తెలియదు. అప్పటి దాకా ఎవరి అనుమానాలు వారికి ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: