ఈసారి ఎన్నికలకు సంవత్సరం ముందుగానే తొలివిడతలో కొంతమందికి టిక్కెట్లు ఖరారు చేయనున్నట్లు ప్రకటించిన టిఆర్ఎస్ అధినేత దాదాపు ఆపనిని పూర్తి చేశారు. ఇప్పటికి దాదాపు 40మందికి టిక్కెట్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే ప్రచారంలో మునిగిపోవడంతో వారి తిప్పలేదో వారు పడుతుంటారని గ్రహించిన కెసిఆర్ ఈసారి ముందుగానే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశారు. కాగా ఖరారు చేసిన పేర్లను ఈనెల 27న ప్రకటించే అవకాశముంది. సిట్టింగ్ ఎమ్మల్యేల స్థానాలు పదిలంగా ఉండగా అదనంగా మరికొంతమంది పేర్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. హుజురాబాద్ నుండి ఈటెల రాజేందర్, సిరిసిల్ల నుండి కెటిఆర్, సిద్దిపేట నుండి హరీష్ రావు, రామగుండం నుండి సోమరాపు సత్యనారాయణతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జూపల్లి, హరీశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గంప గోవర్ధన్, రాజయ్య, బిక్షపతి, ఓదేలు, సమ్మయ్య, కొప్పుల ఈశ్వర్, రమేశ్ రావు తదితర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కన్ ఫాం కాగా ఇటీవలే టిడిపి నుండి టిఆర్ఎస్ లో చేరిన గంగుల కమలాకర్ పేరును కూడా ఖరారు చేశారు. గంగుల కమలాకర్ పేరును ఖరారు చేయడం వల్ల టిఆర్ఎస్ విధించిన గడువులోగా టిఆర్ఎస్ లో చేరితే వారి టిక్కెట్ ఖాయమనే సంకేతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు మరికొంత మంతి అభ్యర్థులను ఖరారు చేశారు. అర్మూర్ నుండి జీవన్ రెడ్డి, జుక్కల్ నుండి గైని గంగారాం, పెద్దపల్లినుండి దాసరి మనోహర్ రెడ్డి, మానకొండూరు నుండి రసమయి బాలకిషన్ లేదా ఆనంద్ పేర్లు పరిశీలిస్తున్నారు. సిర్పూర్ నుండి రాజ్యలక్ష్మి, ఖానాపూర్ నుండి రేఖ శ్యాంనాయక్, మంథని నుండి రాంరెడ్డి, అసిఫాబాద్ నుండి కోవ లక్ష్మి, నిర్మల్ నుండి శ్రీహరిరావు, బోద్ నుండి రాములు, బోదన్ నుండి ఎండి షకీల్, హుస్నాబాద్ నుండి లక్ష్మికాంతారావు లేదా సతీష్ పేర్లను పరిశీలిస్తున్నారు. సంగారెడ్డి నుండి చింత ప్రభాకర్, మెదక్ నుండి పద్మా దేవేందర్ రెడ్డి, పటాన్ చెరువు నుండి అనిల్ కుమార్, మేడ్చెల్ నుండి సుధీర్ రెడ్డి, ఖానాపూర్ నుండి రేఖానాయక్, మల్కాజిగిరి నుండి కనకారెడ్డిల పేర్లు దాదాపు ఖరారు కాగా దొమ్మాట మాజీ ఎమ్మెల్యే, దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంచార్జీ రామలింగారెడ్డిని ఈసారి గజ్వెల్ నియోజకవర్గం నుండి బరిలోకి దింపడానికి అధిష్టానం సిద్దమైనట్లుగా తెలుస్తుంది. జర్నలిస్టుగా పనిచేసిన రోజుల్లో అన్ని వర్గాలతో పరిచయాలున్నటువంటి రామలింగారెడ్డి గజ్వెల్ నియోజకవర్గం నుండి విజయం సాధిస్తారనే నమ్మకంతో అధిష్టానం ఉంది. అదే విధంగా గజ్వెల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంత భాగం రామలింగారెడ్డి ఎమ్మల్యేగా కొనసాగిన కాలంలో దొమ్మాట నియోజకవర్గంలో కలిసి ఉండడం, అక్కడ ఆయనకు ప్రజలతో మంచి సంబంధాలుండడంతో ఈసారి అక్కడనుండి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దుబ్బాక నుండి వ్యాపార వేత్త కొత్త ప్రభాకర్ రెడ్డి తనకు టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. కాగా రామలింగారెడ్డి మాత్రం దుబ్బాక టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నియోజకవర్గం ఇంచార్జీలకే అక్కడి టిక్కెట్ ఇవ్వాలనే నిబంధన ఉండడంతో దుబ్బాక టిక్కెట్ రామలింగారెడ్డికే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: