రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చరిత్ర చెబుతుంది. ఈ మాసంలో ముస్లింలు నిష్టగా పాటించే ఉపవాస దీక్షలతో ఆరోగ్యంతోపాటు ఎంతో పుణ్యం వస్తుందని ఇస్లామిక్ గ్రంథాలు పేర్కొంటున్నాయి. సూర్యోదయానికి ముందు...సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు దూరమవుతాయని ప్రకృతి వైద్యులు సైతం స్పష్టం చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు ఆహారాన్ని తీసుకోవడంలోనే మంచి ఆరోగ్యం దాగుందని ఇస్లాం బోధిస్తోంది. మహ్మద్ ప్రవక్త కూడా ఇదే ఆచారాన్ని పాటించేవారని ఆయన అనుచరులు హదీసులలో పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి. తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణమవడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోజా సమయంలో ఎక్కువగా ఎండు ఫలాలను (డ్రైఫూట్స్) తీసుకుంటారని, వాటిలో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, అమోనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయని ప్రకృతి వైద్యులు సూచిస్తున్నారు. ఇవి ఎనీమియాను దూరం చేస్తాయని, ప్రకృతి వైద్యంలోని పంచతంత్రాల్లో రోజుకు రెండు పూటలు మాత్రమే భోజనం చేయాలనేది ఒక తంత్రమని పేర్కొంటున్నారు. రోజకు రెండు పూటలు మాత్రమే ఘనాహారం తీసుకొని మిగతా సమయాల్లో ద్రవాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఉదయం వేళల్లో తీసుకునే ఆహారాన్ని ‘సహార్’ అని, దీక్ష విరమణ చేసే సమయాన్ని ‘ఇఫ్తార్’ అని అంటారు. రోజా పాటించేవారు సహార్ సమయంలో ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకోవాలి. కనీసం ఖర్జూరం పండునైనా తిని మంచినీటిని పుష్కలంగా తాగాలని చెబుతున్నారు. సహార్ ప్రాముఖ్యతను ఇస్లామిక్ గ్రంథాలు ఎంతో ప్రముఖంగా వివరించాయి. ఆ సమయంలో ముస్లింలు హలాల్ గా భావించే ఏ ఆహారాన్నైనా స్వీకరించవచ్చు. ఇఫ్తార్ తో ఉపవాస దీక్షతో రోజంతా కమ్ముకున్న నీరసం తొలగిపోతుంది. ఆ సమయంలో తీసుకునే పళ్లు, ఫలాలు, హలీంలోని ప్రొటీన్లు, విటమిన్లు సమ్మిళితమై ఉంటాయని పోషకాహారా నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: