హైదరాబాద్: ఎట్టకేలకు ఆత్మ నోరు మెదిపింది. చాలా రోజులు తరువాత కొన్ని మాటలు మాట్లాడింది. మాట్లాడటం అలవాటు లేని ఆత్మ మాట్లాడక మాట్లాడక మాట్లాడిన ఆ రెండుమూడు వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశగా మారాయి. వివాదమయ్యే సూచనలు అగుపిస్తున్నాయి. ఇంకా అర్థం కాలేదా!అదేనండి మన రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు. కేవీపీని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆత్మగా అందరూ భావిస్తారు. ఇక అసలు విషయానికి వద్దాం...ఇటీవల జరిగిన రాష్ర్ట యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపొందారు. నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం గాంధీభవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్, పలువురు రాష్ర్ట మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీపీ మౌనం వీడారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉద్వేగానికి గురయ్యాడు.  రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగానో శ్రమించాడు. చనిపోయే ముందు ఈ భవన్ లో వైఎస్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో రాహూల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడానికి అందరమూ కలిసికట్టుగా పనిచేయాలనీ పిలుపునిచ్చారనీ, అలాంటి మహానుభావుడైన రాజశేఖర్ రెడ్డి ఫోటో ఇక్కడ లేకపోవడం సిగ్గుచేటుకరమైన విషయమంటూ కొంత ఉద్వేగానికి గురయ్యాడు. రాజశేఖర్ రెడ్డి ఫోటో ఇక్కడ లేకపోవడం తనకే కాదు ప్రతి కార్యకర్తను బాధపెడుతున్న విషయమన్నాడు. వైఎస్ ఫోటో ప్రస్తావన చేసినప్పుడు కార్యకర్తల నుంచి విశేషమైన స్పందన లభించింది. వైఎస్ అందరి గుండెల్లో ఉన్నాడన్నప్పడు వైఎస్ఆర్ అభిమానులంతా ఒక్కసారిగా వైఎస్ఆర్ అమర్ రహే అంటూ కార్యకర్తలు నినదించారు. గాంధీభవన్ లో వైఎస్ ఫోటో లేకపోవడంలో తాను ఎవర్ని తప్పుబట్టడం లేదంటూనే బాధకరమన్నాడు. ఫోటో లేకపోవడంపై ముఖ్యమంత్రి సమక్షంలోనే కేవీపీ మాట్లాడటం అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంది ఆత్మ మౌనం వీడింది. ఇంకా ఏం మాట్లాడుతాడోననీ అందరూ కొంత టెన్షన్కు గురైనట్లు కనిపించింది. అయితే, అంతలోనే కేవీపీ ఉద్వేగం నుంచి ప్రసంగంలోకి వచ్చాడు. రాజశేఖర్ రెడ్డి చనిపోయే ముందు ఇదే హాలులో మాట్లాడుతూ2014లో రాహూల్ గాంధీని ప్రధాని చేయాలి. దీని కోసం మన రాష్ర్టం నుంచి 41ఎంపీ స్థానాలకు తగ్గకుండా పంపించాలి. దాని కోసం మనమంతా ఇప్పటి నుంచి అహార్నిశలు శ్రమించాలనీ పిలుపునిచ్చిన మాటల్ని కేవీపీ గుర్తు చేశారు. వైఎస్ ఆశయాలకు అనుగుణంగా మనమందరమూ పార్టీ పటిష్టత కోసం పని చేసి తద్వారా 2014లో రాహూల్ని ప్రధానిగా చేసేందుకు కంకణబద్దులమై పనిచేయాలన్నారు.వైఎస్ ఆశయాల ప్రకారం రాహూల్ ని ప్రధాని చేసేందుకు ఇక్కడనుంచి ప్రతినబూనుదామన్నారు. మొత్తానికి వైఎస్ ఆత్మగా పిలువబడే కేవీపీ మౌనం వీడి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్లో కలకలంరేపింది. ఓ వైపు వైఎస్ ఫోటోలు తీయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వీహెచ్ పోరాటం చేస్తున్నాడు. మరో వైపు వైఎస్ ఆత్మ కేవీపీ మాత్రం గాంధీభవన్లో వైఎస్ ఫోటో లేకపోవడాన్ని తప్పుగా భావిస్తున్నారు. ఈ ఫోటోల లొల్లి చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: