కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో శనివారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. జ్యోతిని దర్శించుకోవడానికి లక్షలామంది ప్రజలు తరలివచ్చారు. మకరజ్యోతి దర్శనమిచ్చిన వేళలో శరణు.. శరణు అంటూ భక్తుల నినాదాలతో శబరిమల మార్మోగింది.


శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

భగవంతుడికీ భక్తుడికీ నడుమ అభేదం. తోడబుట్టిన వారా తొడగొట్టి సమరానికి పిలిచేవారా అన్నది అసంగతం. సకల చరాచర జగత్తులోని సమస్త ప్రాణులూ సాక్షాత్తూ ఆ పరమాత్మ స్వరూపం. చన్నీటి స్నానం ఏకభుక్తం, భూశయనం, అస్ఖలిత బ్రహ్మచర్యం, కామక్రోధాది అరిషడ్వర్గాలకూ మద్యపానాది సప్త వ్యసనాలకూ ఆమడదూరం. యాత్రా మార్గం కఠినాతి కఠినం. అన్నిటికీ ఆ స్వామియే శరణం. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. అయ్యప్పల నామస్మరణతో శబరిమల మార్మోగిపోయింది.



మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలను ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వెళ్తారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: