రాజధాని అమరావతి ప్రాంతంలో జగన్ పర్యటన అనగానే కాస్త ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రతిపక్షనేత పెద్దగా జనాల్లోకి రారనే ప్రచారమూ ఉంది. ఒకవేళ వచ్చారంటే దాని వెనుక ఏదో ఒకటి ముడిపడి ఉంటుందని అందరూ భావిస్తారు. రాజధానిలో రైతుల మద్దతుకోసం వస్తున్నట్టు ప్రకటించారు. అయితే నిఘావర్గాలు మాత్రం జగన్ పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తవచ్చని హెచ్చరించాయి. అందుకే జగన్ పర్యటన మొత్తాన్ని పోలీసులు పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


అయితే – అనుకోకుండా జరిగిన ఓ సంఘటన జగన్ పర్యటనను వార్తల్లో నిలిపింది. సాధారణంగా రైతులను పరామర్శించి వచ్చేస్తే మీడియాలో కవరేజీ రాదనుకున్నారో ఏమో వైసీపీ కార్యకర్తలు జగన్ పర్యటన చివర్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై దాడికి యత్నించారు. అంతే.. జగన్ పర్యటన ఒక్కసారిగా మీడియాలో నిలిచింది. ఇది పనిగట్టుకుని చేసింది కాకపోవచ్చు. అయితే జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు మాత్రం తీవ్ర ఆక్షేపణీయంగా మారింది.


సచివాలయానికి వెళ్తున్న అఖిలప్రియను వెలగపూడి సమీపంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  వాస్తవానికి ఆ రూట్ లో జగన్ పర్యటన ఉందనే సమాచారం తనకు లేదని అఖిలప్రియ చెప్పింది. అందుకే తాను ఆ మార్గంలో వెళ్తున్నట్టు తెలిపింది. వైసీపీ నేతల దౌర్జన్యాన్ని పోలీసులు వెంటనే అడ్డుకుని ఆమెను అతి కష్టంమీద సచివాలయానికి తరలించారు. తనపై దాడి జరిగిన అనంతరం ఆమె గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉపఎన్నికల్లో గెలిచారు. అనంతరం తండ్రితో పాటు టీడీపీలో చేరారు. బహుశా ఇదే వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు. కానీ దాడి చేయడం మాత్రం క్షమించరానిదని – అది కూడా ఓ మహిళా ఎమ్మెల్యేపై దాడి చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: