జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ తమిళనాడు అట్టుడికిపోతోంది. చెన్నై మెరీనా తీరంలో కేవలం రెండు వందల మందితో మంగళవారం ప్రారంభమైన ఆందోళన గురువారం విశ్వరూపం ధరించింది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసేలా ఆర్డినెన్స్‌ తేవాలంటూ ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం... వట్టి చేతులతో తిరిగి వస్తున్నట్లు తెలుసుకున్న తమిళుల ఆగ్రహోదగ్రులయ్యారు. సాయంత్రానికి ఎవరికి వారుగా శుక్రవారం రాష్ట్ర బంద్‌ పాటిస్తున్నట్లు ప్రకటించారు.



సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు, ఏపీలో నిర్వహించే కోడి పందేలకు సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన మద్దతు ప్రకటించారు. జల్టికట్టుపై నిషేధాన్ని ద్రవిడ సంస్కృతి, సమగ్రతపై దాడిగా ఆయన అభివర్ణించారు. దక్షిణ భారతదేశాన్ని కేంద్రం ఎలా చూస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. జల్లికట్టు నిషేధంపై సుప్రీం కోర్టు వెల్లడించాల్సిన తీర్పు వారం రోజులు వాయిదా పడింది. తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే తీర్పు వెల్లడించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమానికి రోజురోజుకూ మద్ధతు అనూహ్యంగా పెరుగుతోంది. ప్రధాన వర్తక, రవాణా, కార్మిక సంఘాలు శుక్రవారం బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. సుమారు లక్ష దుకాణాలు మూతపడనున్నాయి. సుమారు లక్ష ఆటోలు, వ్యానులు, కాల్‌టాక్సీల సేవలు నిలిచిపోతాయి. మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు కొన్ని నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని సహచరులను కోరాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంఘం శుక్రవారం ‘మూకుమ్మడి సెలవు’కు, తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సాయంత్రం ధర్నాలకు పిలుపునిచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: