తమిళులు అనుకున్నది సాధించబోతున్నారు. నాలుగు రోజులుగా చేస్తున్న శాంతియుత పోరాటానికి ఫలితం అందుకోబోతున్నారు. సంప్రదాయ క్రీడను కాపాడుకునేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలించేందుకు మరికొద్ది గంటలే మిగిలుంది. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు తొలిగేలా.. కేంద్రం ఆర్డినెన్స్ ను తెచ్చేందుకు అంగీకరించింది.


జల్లికట్టుపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. 2011లో సుప్రీంకోర్టు ఈ క్రీడను నిషేధించింది. అప్పటి నుండి తమిళ తంబీలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది పొంగల్ సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ జల్లికట్టు నిర్వహించారంటూ.. కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జల్లికట్టుపై పోరాటానికి ఊపిరిలూదింది. సంప్రదాయ క్రీడకు పునర్జీవం పోసేందుకు  తమిళనాడు యువకులు చెన్నై మెరీనా బీచ్ వేదికగా శాంతియుత పోరాటం ప్రారంభించారు. తమ సంస్కృతీ సంప్రదాయాలను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


వీరి పోరాటానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మంగళవారం రాత్రి 50మందితో ప్రారంభమై పోరాటం.. గంటల వ్యవధిలో వేలకు చేరింది. మరుసటి రోజుకు జన సంద్రమైంది. సోషల్ మీడియా, ప్రసారమాధ్యమాల ద్వారా యావత్ దేశ దృష్టిని ఆకర్షించింది. సమాన్య ప్రజల కు తోడు యావత్ సినీ లోకం కదలి వచ్చింది. షూటింగ్ లు నిలిపివేసి మరీ పోరాటానికి మద్దతు పలికింది. 


సమస్య తీవ్ర తరమవుతుందని గుర్తించిన సీఎం పన్నీరు సెల్వం, హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీని కలిసి జల్లికట్టుపై అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ప్రధాని ఆచూతూచి స్పందించడాన్ని నిరసిస్తూ తమిళనాడు బంద్ కు విద్యార్ధి సంఘాలు చేపట్టాయి. ఆందోళనలు ఉధృతం కావడంతో.. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తమిళుల డిమాండ్లు చూసిన కేంద్ర ప్రభుత్వం... ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని న్యాయశాఖకు పంపింది. కేంద్రం పంపిన ఆర్డినెన్స్ ను కొద్దిపాటి మార్పులతో కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. రాష్ట్రపతి ఆమోదించగానే జల్లికట్టు ఆర్డినెన్స్ వెలువడుతుంది. శనివారం సాయంత్రంలోగా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: