ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో, మృత్యువు ఏ రూపంలో కబళిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. హైదరాబాద్‌లోని శంషీర్‌గంజ్‌ చౌరస్తాలో ఆదివారం ఉదయం ఇలాగే ఓ దుర్ఘటన జరిగింది.  ప్రయాణికుల‌తో రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో ముందు చ‌క్రం ఒక్క‌సారిగా ఊడిపోయి గాలిలోకి లేచింది. అది అలాగే ఎగిరి వ‌చ్చి రోడ్డు దాటుతున్న ఓ వ్య‌క్తిపై ప‌డింది. డానికి తోడు ఆ వ్య‌క్తిని ఆటో కొన్ని అడుగుల దూరం ఊడ్చుకెళ్లింది. 



క్షణాల్లో అతడి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికంగా ఓ రైస్‌మిల్లులో హమాలీగా పనిచేసే బాలాపూర్‌లోని వెంకటాపూర్‌కు చెందిన ఎ.జంగయ్య (45) ఈ ఘటనలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో శంషీర్‌గంజ్‌ చౌరస్తాలో జంగయ్య రోడ్డు దాటుతుండగా.. అటుగా వెళ్తున్న టీఎస్‌ 13 యుఏ 3145 నంబరు గల ఆటోకు అకస్మాత్తుగా ముందు టైరు ఊడిపోయింది. దీంతో డ్రైవర్‌ ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆటో అమాంతం పైకిలేచి జంగయ్య మీదికి దూసుకొచ్చింది. 



ఈ దృశ్యాల‌న్నీ అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి.  ఆటో ముందుభాగం జంగయ్య సున్నితమైన భాగాల్లో తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. జంగయ్యకు భార్య పద్మ, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని రెక్కాడితేగాని.. డొక్కాడని కుటుంబం అతనిది. ప్రస్తుతం జీవనాధారాన్ని కోల్పోయింది. శాలిబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. డ్రైవర్‌ మహ్మద్‌ మెహతాబుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: