మీడియా.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అంటారు. అంతటి శక్తివంతమైన మీడియా.. ప్రజల పక్షాన పోరాడవలసిన మీడియా. చాలాసార్లు పక్షపాతం వహిస్తోంది. మన తెలుగు మీడియా సంగతి సరే సరి. అన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు.. ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడం సర్వసాధారణమైపోయింది. కానీ.. ఇప్పుడు తెలుగు మీడియాలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 


తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో అగ్రస్థానంలో ఉన్న టీవీ9 ఇటీవల ఓ రాజకీయ నాయకుడిపట్ల విపరీతమైన ద్వేషం ప్రకటిస్తోంది. కొందరు రాజకీయ నాయకుల స్వభావాన్ని పట్టి వారిని ద్వేషించడం సహజం. ఆ స్వభావాన్ని ప్రజలకూ తెలియజెప్పడమూ సహజమే. కానీ ఎక్కడో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్ల టీవీ9 అంతులేని విద్వేషాన్ని, ఏహ్యభావాన్ని ప్రకటిస్తోంది. 


ట్రంప్ ఎన్నికల్లో నిలబడినప్పటి నుంచి ఇదే తంతు. పోనీ ఎన్నికలకు ముందు అంటే ఓ అర్థముంది. కానీ అమెరికన్లు.. హిల్లరీ క్లింటన్ ను కాదని ట్రంప్ ను ఎన్నుకున్న తర్వాత కూడా టీవీ9 పైత్యం ఏమాత్రం తగ్గలేదు. చివరకు ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజు కూడా టీవీ9 తన విద్వేషాన్ని ఏమాత్రం దాచుకోలేదు. సరికదా.. సరికొత్త టైటిల్స్ పెట్టి కసితీర్చుకుంది. 


ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం జోకర్ కు పట్టాభిషేకం అంటూ అల్లరి చేసింది టీవీ9.. సాయంత్రానికొచ్చేసరికి పోకిరికి పట్టాభిషేకం అంటూ సందడి చేసింది. ఇక మరికొద్దిసేపట్లో ప్రమాణస్వీకారం అనగా.. టైటిల్ మార్చి.. ప్రమాద స్వీకారం అంటూ గోలపెట్టింది. అయినా ఇక్కడెక్కడో ఓ తెలుగు చానళ్లో గోల గోల చేస్తే.. అక్కడి ట్రంప్ కు పోయేదేముందో అంతగా అర్థం కాదు. ఓ నాయకుడి పట్ల అందునా అమెరికా ప్రెసిడెంట్ పట్ల టీవీ9 కు అంత పగ ఎందుకో అర్థం కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: