జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలోని మెరీనా బీచ్‌ తీరంలో చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జల్లికట్టుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినందున ఆందోళన విరమించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకలు మెరీనా బీచ్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మరోవైపు జల్లికట్టు ఉద్యమానికి ముఖ్య కేంద్రమైన మెరీనా బీచ్‌లోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు మెరీనా బీచ్‌ సమీపంలో ఉన్న ఐస్‌హౌస్‌ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసు స్టేషన్‌ ఎదుట ఉన్న వాహనాలను తగలబెట్టారు. 



జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన అలంగానల్లూరులో నేడు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అక్కడ ఉద్యమకారులు ఒక్కసారిగా అదుపుతప్పడంతో పోలీసలు వారిని అదుపు చేసేందుకు లాఠీ ఛార్జి చేశారు. చాలా మంది బయటప్రాంతాల వారు, కొందరు మహిళలు జల్లికట్టుకు మద్దతుగా ఉద్యమిస్తున్న విద్యార్థులకు అండగా నిలిచారు. వీరిని తరలించే సమయంలో హింసాకాండ చెలరేగింది. తిరుచ్చిలో జల్లికట్టు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ ఎంజీఆర్‌ విగ్రహం వద్ద ఉన్న ఆందోళనకారులను పోలీసులు తరలించారు. దాదాపు 100 మంది విద్యార్థులు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. వీరితో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.



మెరీనా బీచ్‌లో ఆందోళనకారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సినీ నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో తన ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీనిలో ఆయన మాట్లాడుతూ తాను ఉద్యమకారులను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. అర్డినెన్స్‌ అంటే ఏమిటో వారికి అర్థమయ్యేలా వివరించి, ఖాళీ చేయాలని కోరతానన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు తనకు ఫోన్లు చేశారని తెలిపారు. లారెన్స్‌ మొదటి నుంచి జల్లికట్టును సమర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: