తమిళుల నాలుగు రోజుల ఆందోళనలతో.. కేంద్రం దిగొచ్చింది. జల్లికట్టు కట్టుకు అధికారిక హోదా కల్పిస్తూ.. నిషేధిత జంతువుల జాబితా నుండి ఎద్దును తప్పించింది. ఈ నేపథ్యంలో అదే ఉద్యమ స్పూర్తితో ఆంధ్రులు కూడా ప్రత్యేక హోదా సాధన ఉద్యమానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం జల్లికట్టు పోరాటం,  ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి పోలికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. 


జల్లికట్టుకు హుటాహుటిన ఆర్డినెన్స్ కల్పించిన కేంద్రం, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ముందడుగు వేస్తుందా లేదా  అనే దానిపై చర్చ మొదలైంది. జల్లికట్టుకు ఆర్డినెన్స్ జారీ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఆర్ధికంగా భారమేమీ ఉండదు. పైగా తమిళుల సంస్కృతి, సంప్రదాయాలకు విలువిచ్చినట్లవుతుంది. ఎప్పట్నుంచో తమిళనాడులో పాగా వేయాలనుకుంటున్న బీజేపికి ఈ నిర్ణయం కలిసొస్తుంది. కాబట్టే జల్లికట్టు విషయంలో కేంద్రం పాజిటివ్ గా స్పందించిందనే వాదన వినిపిస్తోంది.


విభజన తరువాత లోటు బడ్జెట్ తో మొదలైన రాష్ట్ర ప్రభుత్వ ప్రయాణం.. మునుముందు సాఫీగా సాగాలంటే.. ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమనేది నిపుణుల వాదన. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే.. ఆర్ధికంగా కేంద్రానికి భారం. పైగా ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే అనేక రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు మొదలయ్యే ప్రమాదముంది. అదే జరిగితే.. కేంద్రానికి మోయలేని భారమవుతుంది. 


ఈ లెక్కలన్నింటిని బేరీజు వేసుకున్న కేంద్రం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకుండా.. ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టేందుకు చూస్తోందనేది జగమెరిగిన సత్యం. ఆర్ధిక పరమైన హామీల అమలుకు కేంద్రం మొగ్గు చూపే అవకాశం  లేక పోవడంతో.. ప్రత్యేక హోదా విషయంలో విపక్షాలు ఎన్ని పోరాటాలు చేసినా రాష్ట్రానికి నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: