తమిళనాడు పీఠంపై ఎలాగైనా సరే కూర్చోవాలని భావిస్తున్న శశికళ ... తన ఆధీనంలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. బృందాలుగా విభజించి వేరు వేరు ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహిస్తూ ఒకరి సమాచారం మరోకరికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా  ఎమ్మెల్యేల నుంచి సెల్‌ఫోన్లను తీసుకున్న శశికళ వర్గీయులు .. టీవీలను ఆపేసి ఎలాంటి సమాచారం అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

అమ్మ సమాధి దగ్గర పన్నీరు సెల్వం ధాన్యంతో  ప్రారంభమైన ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పన్నీరు ప్రకటనతో అప్రమత్తమైన శశికళ బుధవారం ఉదయమే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి తన మద్దతుదార్లందరినీ లగ్జరీ బస్సుల్లో తరలించింది. ఎమ్మెల్యేలను రెండు బృందాలుగా విభజించి వేరు వేరు ప్రదేశాలకు తరలించారు.

 

మొత్తం 130 ఎమ్మెల్యేల్లో 90 మంది ఒకచోట 40 మందిని మరో చోట ఉంచారు. వీరిలో 90 మందిని మహాబలిపురంలోని కూవతూర్‌ సమీపంలోని  ఓ రెస్టారెంట్‌లో ఉంచగా మిగిలిన వారిని కల్పాక్కమ్ దగ్గర్లోని మరో రెస్టారెంట్‌లో ఉంచారు.   బస్సుల్లో ఎక్కిఎక్కగానే ఎమ్మెల్యేల  సెల్‌ ఫోన్లను  శశికళ వర్గీయులు లాగేసుకున్నారు. అయితే రాష్ట్రంలో గంట గంటకు పరిస్ధితులు మారుతూ ఉండటం... పన్నీరు సెల్వం తన తడాఖా ఏంటో చూపుతూ ఉండటంతో అలర్టయిన శశికళ .. ఎమ్మెల్యేలు బస చేస్తున్న రెస్టారెంట్లలో టీవీలు ప్రసారం కాకుండా చర్యలు తీసుకున్నారు. తన వర్గీయులకు దగ్గర తప్ప మరెవ్వరి దగ్గర సెల్‌ఫోన్లు లేకుండా చేయాలని ఆదేశించారు. 

 

సెల్‌ఫోన్లు లాక్కోని బలవంతంగా టీవీ ప్రసారాలు ఆపేయడంపై కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇలాగైతే తమ దారి తాము చూసుకుంటామని భోజనం కూడా మానేసి ఆందోళన చేస్తున్నట్టు సమాచారం. ఈ బృందంలోని  ఎస్పీ షణ్ముగనాథన్‌ అనే ఎమ్మెల్య్ బాత్‌ రూంకంటూ  బయటకు వచ్చి రోడ్డు మార్గం ద్వారా మహాబలి పురం చేరుకుని పన్నీరు సెల్వం చెంతకు చేరాడు. దీంతో విషయం తెలుసుకున్న మీడియా సిబ్బంది నిర్ధారణ చేసుకునేందుకు వెళుతుండగా రిసార్ట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే శశికళ వర్గీయులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో   పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌గా ఉన్న  మధుసూదనన్ కూడా క్యాంప్‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి  సీఎం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలిశారు.  

 

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచినా  ఎమ్మెల్యేలు  ఒక్కొక్కరుగా  వెళ్లిపోవడంతో  శశి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.  బల నిరూపణకు ఆదేశిస్తే మరికొందరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వెళ్లిపోతారేమోనన్న గుబులు శశి మద్ధతుదార్లలో వ్యక్తమవుతోంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ బయటకు రాకుండా చూడాలంటూ సిబ్బందికి శశికళ స్వయంగా  ఆదేశాలు జారీ చేయడంతో పరిస్ధితులను ఎప్పటి కప్పుడు వాకబ్‌ చేస్తూ ఆగ్రహంగా ఉన్న  ఎమ్మెల్యేల  వివరాలను తెలుసుకుంటోంది.    

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: