గతకొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు నోరు విప్పారు. తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తెలుగు నాట హాట్‌ టాపిక్‌ గా మారుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో పాటు ఓ పత్రిక పెద్ద మనిషి తీరుపై కూడా స్పందించారు.


దగ్గుబాటి వెంకటేశ్వర రావు గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నేత మంత్రిగా, ఎన్టీఆర్‌ అల్లుడిగా దగ్గుబాటి ఎంతో పాపులర్‌. అయితే ఆతర్వాతి కాలంలో తన భార్య పురంధేశ్వరిని తెరపైకి తెచ్చి..  తాను మాత్రం తెరచాటుగా ఉండిపోయారు. అప్పుడప్పుడు చంద్రబాబు తీరుపై మండిపడుతూ అడపా దడపా మీడియాలో కనిపిస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం ప్రత్యేకించి తమిళనాట జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తూ.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన అధికార మార్పిడిని గుర్తు చేసుకున్నారు.


గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్‌ చేతిలో నుంచి అధికారాన్ని ఎలా చేజిక్చించుకుంది, అందుకు తాను ఎందుకు మద్దతిచ్చారు.. ఎన్టీఆర్‌ కుటుంబం కామ్‌ గా ఉండడానికి గల కారణాలను చెప్పారు దగ్గుబాటి. వాస్తవానికి అప్పట్లో చంద్రబాబు వెనక ఆరేడుగురుకన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరని, అయినా ఏపీలో టాప్‌ లో ఉన్న ఓ పత్రిక బాబుక అనుకూలంగా కథనాలు రాస్తూ.. బాబుకు ఫుల్‌ సపోర్టు ఉందని ఉత్తుత్తి ప్రచారం చేసిందని, ఇది తప్పని చెప్పినా సదరు పత్రికా యాజమాన్యం తనను పట్టించుకోలేదని గుర్తు చేసుకున్నారు. అందుకే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు బాబు పక్షాన చేరి ఆయనను సీఎం చేశారని అన్నారు.


తాను కూడా రాజకీయ వ్యవస్థలో ఉండాలన్న కాంక్షతోనే బాబు పక్షాన నిలిచానని అన్నారు. అయితే ఆ తర్వాత కొందరు నేతలు బాబుకు పక్కలో బళ్లెం పెట్టుకున్నావని చెప్పడంతో క్రమంగా తనను దూరం పెట్టడం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. అందుకే నిర్భయంగా చెప్పగలుగుతున్నాని అన్నారు.


ఇదే తంతు ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుందని, అయితే శశికళ కూడా చంద్రబాబు లాగానే వ్యవహరిస్తోందన్న అభిప్రాయపడ్డారు. కానీ బాబుకు ఇక్కడ ఓ పత్రిక అనుకూలంగా వ్యవహరిస్తే.. శశి చేతిలో ఒక్క మీడియా కూడా లేక పోవడమే మైనస్‌ అని దగ్గుబాటి విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ బాబు,, అక్కడ శశి ఇద్దరు ఇద్దరేనని.. అధికారం కోసమే పాకులాడుతున్నారని చెప్పకనే చెప్పారు దగ్గుబాటి.


మరింత సమాచారం తెలుసుకోండి: