ఉచిత కాల్స్‌, డేటాతో భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో వ్యూహాత్మకంగా మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. మార్చి 31తో జియో ఉచిత సర్వీసులకు కాలం ముగుస్తుందనుకుంటున్న తరుణంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ ‘జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుత యూజర్లు మాత్రం వన్‌ టైమ్‌ జాయినింగ్‌ ఫీజు కింద రూ. 99 కడితే నెలకు రూ. 303 టారిఫ్‌తో ప్రస్తుత ఉచిత ప్రయోజనాలను మరో 12 నెలల పాటు పొందవచ్చు. రిలయన్స్‌ జియో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మంగళవారం ఈ విషయాలు వెల్లడించారు.


రిలయన్స్‌ జియో...మరో బంపర్‌ ఆఫర్‌!

దేశవ్యాప్త సేవలు ఆరంభించిన సెప్టెంబరు 5 నుంచి 170 రోజుల వ్యవధిలోనే 10 కోట్ల మందికి పైగా చందాదార్లు రిలయన్స్‌ జియోకు సమకూరారని, సంస్థపై వారు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా, నూతన పథకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మరే ఇతర టెలికాం సంస్థల కంటే కూడా, ప్రతి పథకంలోనూ తమ చందాదార్లకు 20 శాతం డేటాను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాదాపు దశాబ్దం తర్వాత టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టిన ముకేశ్‌ అంబానీ.. ఉచిత డేటా, వాయిస్‌ ప్లాన్లతో దేశీ టెలికం పరిశ్రమను కుదిపేశారు. జియో ఆఫర్లకు దీటుగా మిగతా టెల్కోలు టారిఫ్‌లు భారీగా తగ్గించాల్సి వచ్చింది. దీంతో పోటీ మార్కెట్లో టెలికం కంపెనీల విలీనాల ప్రతిపాదనలు కూడా తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.



ప్రస్తుత చందాదారులు మార్చి 1 నుంచి 31 మధ్య రూ.99 చెల్లిస్తే, రిలయన్స్‌ జియో ప్రాథమిక సభ్యత్వం (ప్రైమ్‌ మెంబర్‌షిప్‌) లభిస్తుంది. మై జియో యాప్‌ ద్వారా,www.jio.com వెబ్‌సైట్‌లోనూ, విక్రయశాలలకు వెళ్లి ఈ మొత్తం చెల్లించవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2018 మార్చి 31 వరకు వీరు కాల్స్‌ అన్నీ ఉచితంగా చేసుకోవచ్చు. దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా, ఎస్‌టీడీ కాల్స్‌ అయినా అపరిమితంగా చేసుకోవచ్చు. జాతీయస్థాయిలో రోమింగ్‌ ఛార్జీలు కూడా ఉండవు. ఒక టెలికాం సర్కిల్‌ పరిధిలోని వారు, ఇతర సర్కిళ్ల (రాష్ట్రాల)కు వెళ్లినా, కాల్స్‌ చేసుకోడానికి, అందుకోడానికి ఛార్జీలు ఏమీ పడవు.

మరింత సమాచారం తెలుసుకోండి: