ఏపీలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ముచ్చట్లు జోరుగా సాగుతున్నాయి. చినబాబు లోకేశ్ కు పట్టాభిషేకం తప్పదని ఇప్పటికే తేలిపోయింది. ఆయన కోసం ఎవరో ఒక మంత్రిని బలిపెట్టడం తప్పదన్న సంగతీ తేలిపోయింది. మరి ఇప్పుడు తేలాల్సింది ఆ బలి పశువు ఎవరన్న విషయమే. ఇందుకు ప్రధానంగా అందరి దృష్టీ మంత్రి నారాయణవైపే వెళ్తోంది. 


ఎందుకంటే... చంద్రబాబు మంత్రివర్గంలో సాధారణ పరిపాలన తర్వాత అత్యంత కీలకమైన శాఖ మున్సిపల్ శాఖ. ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణం వ్యవహారాలన్నీ ఈ శాఖే చూస్తోంది. రాజధాని నిర్మాణం కోసం సీఆర్ డీఏ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసినా దాని పర్యవేక్షణ నారాయణ కనుసన్నల్లోనే సాగుతోంది. అమరావతి నిర్మాణంలో నారాయణ ఆది నుంచి కీలకపాత్ర పోషిస్తున్నారు. 


మరి లోకేశ్ ను సమర్థుడుగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇలాంటి కీలకమైన శాఖే కావాలి. అందుకే మున్సిపల్ శాఖ నుంచి నారాయణను తప్పించి.. లోకేశ్ కు ఆ పదవి అప్పగిస్తారన్న విశ్లేషణ, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇందుకు నారాయణ అంగీకరిస్తారా.. ఆయన్ను ఎలా ఒప్పిస్తారన్నది కీలకంగా మారింది. వాస్తవానికి నారాయణ పార్టీ నాయకుడేం కాదు. 


కానీ పార్టీ ఎన్నికల విజయాల్లో కీలకపాత్ర పోషించిన తెర వెనుక వ్యక్తి. అందుకే ఈ సమయంలో తప్పిస్తే ఆయన అవమానంగా భావించే అవకాశం ఉంది. అందుకే రాజధాని సంస్థ కోసం ఓ పదవి సృష్టించి దాన్ని నారాయణకు అప్పగించవచ్చని భావిస్తున్నారు. అలాగే ఐటీ శాఖను కూడా చంద్రబాబు లోకేశ్ కు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే పల్లె రఘునాథరెడ్డికి కూడా షాక్ ఇవ్వబోతున్నారన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: