ఏపిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు కానుంది. చంద్రబాబు నివాసంలో జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో నారా లోకేష్ కు కూడా ఎమ్మెల్సీ స్థానం కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో... ఎమ్మెల్సీలుగా ఎవరెవరికి అవకాశం దక్కుతుందా అన్న ఉత్కంఠత టిడిపి శ్రేణుల్లో నెలకొంది. 


ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలకు,  తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల అభ్యర్థులను అనుసరించి ఎమ్మెల్యే, గవర్నర్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో ఇవాళ జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఎంతో కీలకం కానుంది. మొత్తంగా తమను అభ్యర్థులుగా పరిగణించాలంటూ 16స్థానాలకు దాదాపు 150దరఖాస్తులు అధిష్టానానికి అందాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు దాఖలుకు ఈ నెల 28 చివరి తేదీ. కానీ ఇప్పటి వరకూ కడప జిల్లా స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఒక్క బీటెక్ రవి పేరును మాత్రమే పార్టీ ఖరారు చేసింది. మిగిలిన 8స్థానాలకు పొలిట్ బ్యూరోలో ఖరారు చేయనున్నారు. స్థానిక సంస్థల కోటాలో పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కలిసెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. జిల్లా నుంచి మరో 20వరకూ దరఖాస్తులు వచ్చినా..., బగ్గు లక్ష్మణరావు,  శత్రుచర్ల విజయరామరాజు పేర్లు వినిపిస్తున్నాయి.


తూర్పు గోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు పేరు పరిశీలనలో ఉండగా..., తాజాగా జ్యోతుల చంటిబాబు పేరు కూడా తెరపైకి వచ్చింది.. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నిక ఉండటంతో ఒకటి మంతెనకు దక్కవచ్చని భావిస్తున్నారు. మరో స్థానానికి  సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు పేరును పరిశీలిస్తున్నారు. 2014ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం అన్ని స్థానాలు గెలుపొందినందున... ఎమ్మెల్యే కోటాలోను తమకు మరొక సీటు అవకాశం కల్పించాలని జిల్లా నేతలంతా అధినేతకు ఇచ్చిన విజ్ఞాపన ఎంతవరకూ పరిగణనలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి.  ఇక నెల్లూరు జిల్లాలో సిటింగ్‌ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, ఆనం సోదరుల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో దొరబాబు పేరు పరిశీలనలో ఉండగా..., సత్యవేడు మాజీ ఎమ్మెల్సీ హేమలతతోపాటు, నరేష్ కుమార్ రెడ్డి కూడా తనకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. అనంతపురం జిల్లాలో  దీపక్ రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, సుబ్రమణ్యం నాయుడు, అబ్దుల్ ఘనిలు ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కర్నూలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డికి మరో సారి కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా శిల్పా సోదరులకు ఎమ్మెల్సీల్లో ప్రాధాన్యం కల్పించవచ్చని తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లూ తనకు అవకాశం కల్పించాలని ఆశిస్తున్నారు.


ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా వున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పోలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు మార్చి ఏడో తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో, త్వరితగతిన అభ్యర్థులను ఖరారు చేయాలని టిడిపి భావిస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో నారా లోకేష్ కు ఓ ఎమ్మెల్సీ స్థానం ఖరారైన నేపథ్యంలో, మిగిలిన స్థానాల విషయంలో కుల సమీకరణల ప్రాధాన్యతతో అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు.  ఈసారి ఎమ్మెల్యే కోటా పోరు రసవత్తరం కానుంది. మొత్తం ఏడు స్థానాలకు జరిగే పోరులో సంఖ్య బలం పరంగా తెలుగుదేశం-5, వైసీపీకి ఒకటి ఖరారు కానుంది. ఏడో స్థానానికి పార్టీ బలాబలాలను బట్టి చూస్తే జగన్ పార్టీ నుంచి 20మందికి పైగా ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో తెలుగుదేశంలో చేరారు. ఏడో స్థానానికి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవటంతో రెండో ప్రాధాన్య ఓటు కీలకం కానుంది. దీంతో ఏడో స్థానానికి పోటీ జరుగుతుందా లేక ఏకగ్రీవం కానుందా అన్నది ఆసక్తిగా మారింది. 


ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం కరణం బలరాం, పుష్పరాజ్, జూపూడి ప్రభాకరరావు, గోనగుంట్ల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, దాసరి రాజా మాస్టర్,  దివి శివరాంలు, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, చందు సాంబశివరావు, గొట్టిపాటి రామక్రిష్ణ,  కొమ్మినేని వికాస్ లు పోటీలో వున్నారు. మహిళా కోటాలో పంచమర్తి అనురాథ, శోభా హైమావతి, ముళ్ళపూడి రేణుక, పోతుల సునీతలు తమకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. 


మొత్తంమీద తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. పోలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్థుల ఖరారు కానున్న నేపథ్యంలో, తమ పేర్లు వుంటాయా లేవా అని ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే శాసనమండలి నుండి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహించనున్న నేపథ్యంలో, ఈసారి యువతకు ప్రాధాన్యత ఎక్కువగా వుండే అవకాశమున్నట్లుగా టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: