ట్రంప్ నినాదాలు, విధానాలను ఆయన అభిమానులు నరనరాన జీర్ణించుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ట్రంప్ విదేశీయులను అమెరికా నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తుంటే.. ఆయన అభిమానులు ఏకంగా లోకం నుంచే పంపే పనిలో పడ్డారు. ముఖ్యంగా తెలుగోడిపై తెల్లోళ్లు అసూయ, విద్వేషాలతో రగిలిపోతున్నట్లున్నారు. అమెరికాలో తెలుగోడిపై తెల్లోడు జరిపిన కాల్పుల దాడే ఇందుకు నిదర్శనం.

అమెరికాలో తెలుగు యువకులపై జరిగిన దాడి ఘటన పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుండగుడి కాల్పుల్లో మరణించిన కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్య అడిగిన ప్రశ్నలు.. ఆమె ఆవేదన..చూస్తే అమెరికాలో విదేశీయుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్ధమవుతోంది. ట్రంప్‌ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత విదేశీయుల్లో నెలకొన్న అభద్రత భావం ఎంతలా వారిని భయభ్రాంతులకు గురిచేస్తుందో తెలిసిపోతుంది.


మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా..? మైనార్టీల భద్రత కోసం అమెరికా ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఇకనైనా ఇలాంటి విద్వేష పూరిత నేరాలను ఆపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందా..? నాకు సమాధానం కావాలి.. ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం చెప్పాలి.. అని అమెరికాలో కాల్పుల్లో మరణించిన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన ప్రశ్నించారు. కన్సాస్ లో ఓ అమెరికన్ జాత్యహంకార కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా, అలోక్ అనే యువకుడు గాయాలతో బయటపడిన ఘటనపట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  శ్రీనివాస్ కూచిభొట్ల ఉద్యోగం చేసే గార్మిన్ కంపెనీ నిర్వహించిన మీడియా సమావేశంలో సునయన అమెరికా అధ్యక్షుడిపై ప్రశ్నల వర్షం కురిపించింది. 


ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అమెరికాలో జరుగుతున్న ఘటనలు తనను ఆందోళనకు గురిచేశాయని, ఒకదశలో ఈ దేశంలో మనం ఉండగలమా.? అని తన భర్తని అడిగితే.. ఏం కాదు అమెరికాలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇండియాకు తిరిగి వెళ్లిపోదామని ఎన్నిసార్లు చెప్పినా.. యూఎస్‌ లోనే ఉందామని పదే పదే చెప్పావారని.. మరికొన్నాళ్లలో పరిస్థితి మారిపోతోందని అన్నారని ఆమె విలపిస్తూ వెల్లడించారు. అమెరికాలో మైనారిటీలు, విదేశీయులపట్ల వివక్ష చూపుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయని, మేం ఇక్కడి వాళ్లమేనా.? అన్న సందేహాలు కలిగిస్తున్నాయని ఆమె అన్నారు.


ఇప్పటికైనా ఈ విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా.? అని ఆమె ప్రశ్నించారు. విద్వేష దారుణాలపై అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సునయన. తన భర్తకు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు.  ఇంత జరిగాక, ఇంకా అమెరికాలో ఉండటం అవసరమా.? అని ఆమె వ్యాఖ్యానించారు. తమకు పిల్లలు కూడా లేరని, తన భర్త జ్ఞాపకాలే ఇప్పుడు తమకు మిగిలాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


భారతీయులపై దాడుల పట్ల ఇండో -అమెరికన్‌ సెనెటర్‌ కమలా హరీస్‌ స్పందించారు. విద్వేశం విజయం సాధించడాన్ని తామేమాత్రం సహించబోమని ఆమె ట్వీట్‌ చేశారు. కన్సాస్‌ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి జాతివివక్ష ఘటనలు ఎక్కువవయ్యాయని కమలా హారీస్‌ మండిపడ్డారు. ఆమెతో పాటు పలువురు సెనెటర్లు కూడా ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. అటు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల శ్రీనివాస్‌ మృతికి నివాళులు అర్పించారు. అమెరికా సమాజంలో అర్ధరహిత హింస, మూఢ విశ్వాసాలకు స్థానం లేదని అన్నారు.


హ్యూస్టన్‌ లోని భారత కాన్సుల్ జనరల్ అనుపమ రే.. శ్రీనివాస్ కుటుంబానికి సహాయం చేస్తున్నారు. ఘటన గురించి తెలియగానే డిప్యూటీ కాన్సుల్ ఆర్డీ జోషి, వైస్ కాన్సుల్ హెచ్ సింగ్ కన్సాస్ కు వెళ్లి అవసరమైన సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనలో మునిగిపోయిన అక్కడి భారతీయులతో మాట్లాడారు. కాల్పుల్లో గాయపడ్డ అలోక్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తెలుగు యువకులను కాపాడేందుకు కాల్పులను అడ్డుకోబోయిన మరో అమెరికన్ గ్రిల్లాట్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: