జాతివిద్వేష నేరాలను ఆపేందుకు అమెరికా సర్కారు ఏం చేయబోతున్నది? మైనారిటీల పట్ల పెరుగుతున్న వివక్షలను చూస్తూ ఊరుకుంటారా? అసలు మాకిక్కడ చోటులేదా? అమెరికాలో జాత్యహంకార ఉన్మాది కాల్పులకు బలైన శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణి సునయన దుమల్ ట్రంప్ సర్కారుపై ఎక్కుపెట్టిన ప్రశ్నలివి. మేమసలు అమెరికాకు చెందుతామా, చెందమా, అనే దిగ్భ్రాంతికి మైనారిటీలు గురవుతున్నారు అంటూ ఆమె శ్రీనివాస్‌ పనిచేస్తున్న జిపీఎస్‌ తయారీదారు ‘గార్మిన్‌’ సంస్థలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.


sunayana

శ్రీనివాస్ 2005లో ఎన్నో కలలతో అమెరికాకు వచ్చాడని ఆమె చెప్పారు. ఎల్‌పాసోలోని యూనివర్సిటీ ఆప్ టెక్సాస్‌లో ఎమ్మెస్ చేశాడని, ఆరేండ్ల పాటు అయోవాలో రాక్‌వెల్ కాలిన్స్ కంపెనీలో పనిచేశాడని తెలిపారు. తర్వాత గార్మిన్‌లో చేరి కాన్సస్ నగరానికి మారిపోయాడని సునయన వివరించారు. కాన్సస్‌లోనే మేం స్థిరపడ్డాం. ఒలేథలో ఇద్దరం కలిసి కలలగూడు లాంటి ఇల్లు సొంతం చేసుకున్నాం అని చెప్పారు. 



ఇప్పుడాయన దారుణంగా బలైపోయారు. ఈ పరిస్థితుల్లో మేము అమెరికాలో ఉండటమనేది సరైన పనేనా’ అంటూ ఆమె ఉద్వేగంగా ప్రశ్నించారు. ఇమిగ్రెంట్లకు అసలిక్కడ విలువ ఉందా అని అడిగారు. నా ఒక్కదాని భర్త గురించే అడగటం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నా ప్రశ్నకు జవాబు కావాలి అంటూ ఆమె గద్గద స్వరతో పేర్కొన్నారు. సంతానం గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. మాకు పిల్లలు లేరు.. ఇక త్వరలో పిల్లలు కలుగాలని కోరుకుంటున్న దశలోనే ఇది జరిగింది. పిల్లలుంటే కనీసం వారిలోనైనా నేను శ్రీనివాస్‌ను చూసుకునేదాన్ని. ఇప్పుడా అవకాశం లేదు. కేవలం జ్ఞాపకాలే మిగిలాయి. అని సునయన అన్నారు. ఆఫీసు పని అయిపోయాక మిత్రునితో కలిసి సరదాగా గడుపుదామని బార్‌కు వెళ్లి కూర్చున్న శ్రీనివాస్‌ను జాత్యహంకారి రూపంలో మృత్యువు వచ్చి కబళించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: